
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని తన మునుపటి అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ రాయ్ మరోమారు స్పష్టం చేశారు. తరతరాలుగా గాంధీ కుటుంబం అమేథీ ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తోందని, 2024 ఎన్నికల్లో రాహుల్ ఈ స్థానం నుంచే పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పునరుద్ఘాటించారు.
కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్.. అమేథీలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అమేథీ స్థానంలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే అదేసమయంలో రాహుల్ కేరళలోని వయనాడ్ సీటులో 4.31 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటిసారిగా దక్షిణ భారతదేశంతో కాంగ్రెస్ సత్తాను చాటారు.
రాహుల్ గాంధీ తన పాత కంచుకోట అమేథీకి తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అజయ్ రాయ్ తన అభిప్రాయం తెలియజేయడం ఇది రెండోసారి. గతంలో లక్నోలో కూడా ఆయన ఇదే తరహా ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చడం ద్వారా లబ్ధిపొందాలని బీజేపీ చూస్తున్నదని ఆయన విమర్శించారు.
రామ మందిర నిర్మాణం అనేది మతవిశ్వాసాలకు సంబంధించిన అంశమని, దానిని భారీ కార్యక్రమంగా చేయకూడదని అన్నారు. ఎన్నికల సంవత్సరంలో జనాన్ని వంచించేందుకు బీజేపీ ఇలాంటి పనులను చేస్తున్నదన్నారు. రాముడు అందరివాడని, బీజేపీకే పరిమితం కాడని అజయ్ రాయ్ అన్నారు. కాగా అమెథీ లోక్‌సభ బరిలో బీజేపీ తిరిగి స్మృతి ఇరానీని రాహుల్‌తో పోటీకి దించనున్నదని సమాచారం.
ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం..