రెండో అణు జలాంతర్గామిని నేవీలో ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: భారత్ అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి ‘అరిఘాత్’చేరింది. అరిహంత్ క్లాస్‌లో రెండోదైన ఈ అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను విశాఖ నేవల్ డాక్‌యార్డులో గురువారం జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన త్రివిధ దళాలు అణుశక్తిని సముపార్జించుకుని మరింత బలోపేతమయ్యాయని తెలిపారు. అణుత్రయాన్ని బలోపేతం చేసుకుంటూ వ్యూహాత్మక సమతుల్యత, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో భారత్ కీలకంగా మారుతోందన్నారు.
దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని, సైనికులకు అత్యాధునిక, నాణ్యమైన ఆయుధాలు, మౌలిక సదుపాయాలు, ఇతర పరికరాల్ని సమకూర్చేందుకు మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని చెప్పారు. దేశాన్ని అగ్ర రాజ్యాలతో సమానంగా నిలబెట్టిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయ సంకల్పాన్ని దేశం ఎప్పటికీ మరవదన్నారు. నేటి భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రక్షణ సహా ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.
అరిఘాత్ ప్రత్యేకతలు..
పొడవు: 111.6 మీటర్లు
వెడల్పు: 11 మీటర్లు
డ్రాఫ్ట్: 9.5 మీటర్లు
బరువు: 6,000 టన్నులు
సామర్థ్యం: ఉపరితలంలో గంటకు 22–24 కి.మీ. (12–15 నాటికల్ మైళ్లు).. సాగర గర్భంలో గంటకు 24 నాటికల్ మైళ్లు
నిర్మాణం: విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ సెన్సార్ సిస్టమ్, ఇతర ప్రత్యేకతలు: సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, టార్పెడోలు, సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్, పంచేంద్రియ యూనిఫైడ్ సోనార్ సబ్‌మెరైన్, సముద్ర జలాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థ, కంట్రోల్ సిస్టమ్.
మిస్సైల్ రేంజ్ : 750 కిలోమీటర్లు
Comments
Please login to add a commentAdd a comment