సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతాలలో సైనిక రవాణాను సులభతరం చేసేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) ఆధ్వర్యంలో నిర్మించిన 44 వంతెనలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని వంతెలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్ కారణంగా దేశం ఇప్పటికే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో చైనా, పాకిస్తాన్‌లు భారత్ సరిహద్దులలో వివాదాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పశ్చిమ, ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లోని భారత సాయుధ దళాలకు సైనిక, పౌర రవాణాకు ఈ నిర్మాణాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఉద్రిక్తంగానే సరిహద్దు.. రాజ్‌నాథ్ ప్రకటన)
రవాణా అందుబాటులో లేని ఆ ప్రాంతాల్లో ఏడాది పొడవునా సాయుధ దళాల సిబ్బందిని అధిక సంఖ్యలో మోహరిస్తున్నందున ఈ వంతెనల నిర్మాణాలు వారికి ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. దేశ రక్షణకు పాటు పడే సాయుధ దళాలకు, సైన్యానికి మౌలిక సదుపాయలను అందించేందుకు ప్రాజెక్టులను నిర్మించడంలో మోదీ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూనే దేశ సరిహద్దుల వద్ద పరిస్థితులను ప్రధాని మోదీ మెరుగుపరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: దేశ రక్షణలోకి 'స్మార్ట్'గా...)
Comments
Please login to add a commentAdd a comment