పేద మహిళలకు ఏటా రూ. లక్ష | Rs 1 lakh annual grant and double wage for Asha workers says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

పేద మహిళలకు ఏటా రూ. లక్ష

Published Thu, Mar 14 2024 6:12 AM | Last Updated on Thu, Mar 14 2024 6:12 AM

Rs 1 lakh annual grant and double wage for Asha workers says Rahul Gandhi - Sakshi

ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 50 శాతం రిజర్వేషన్‌

‘మహిళా న్యాయ్‌’ పేరిట ఎన్నికల హామీలను ప్రకటించిన రాహుల్‌ గాంధీ

ధులే: ఐదురకాల హామీలతో యువతకు ‘యువ న్యాయ్‌’ పేరిట ఎన్నికల వరాలు ప్రకటించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం పేద మహిళల కోసం ప్రత్యేకంగా ‘మహిళా న్యాయ్‌’ పేరిట హామీలను ఇచ్చారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏటా రూ.1 లక్ష అందజేస్తామని, వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ అమలుచేస్తామని ప్రకటించారు. 50 శాతం రిజర్వేషన్‌ పరిమితిని రాజ్యాంగ సవరణ ద్వారా తొలగిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చెప్పారు.

బుధవారం మహారాష్ట్రలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా ధులే జిల్లాలో జరిగిన మహిళా ర్యాలీలో ఐదు ‘మహిళా న్యాయ్‌’ గ్యారెంటీలను రాహుల్‌  ప్రకటించారు. ‘ ఏటా పేద మహిళలకు రూ.1 లక్ష వారి బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తాం. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తాం. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, చైల్డ్‌ కేర్‌ సెంటర్లలో పనిచేసే మహిళా సిబ్బందికి అందే వేతనంలో కేంద్రం తరఫు బడ్జెట్‌ను రెట్టింపు చేస్తాం.

మహిళా సమస్యల పరిష్కారానికి, తమ హక్కుల పట్ల మహిళల్లో అవగాహన పెంపునకు నోడల్‌ అధికారిని నియమిస్తాం. దేశంలో ప్రతీ జిల్లాలో సావిత్రిబాయ్‌ ఫూలే హాస్టళ్లను నెలకొల్పుతాం’’ అని హామీలు ఇచ్చారు. ‘‘ మోదీ సర్కార్‌ మహిళలను మహిళా రిజర్వేషన్‌ చట్టం పేరిట ఎగతాళి చేసింది. ఆర్భాటంగా చట్టం చేసింది. కానీ పదేళ్ల  తర్వాతే దానిని అమలుచేస్తారట. మేం అధికారంలోకి వస్తే తక్షణం చట్టాన్ని అమలుచేస్తాం’ అని రాహుల్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement