కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్, ఎర్నాకులం, వాయనాడ్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వాతావరణం అనుకూలించే వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని అధికార యంత్రాంగం ఆదేశించింది.
ఉత్తర మలప్పురం, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్, ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
కొట్టాయం జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలులతో చెట్లు కూలడంతో ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.ఉత్తర కోజికోడ్‌లోని ఓంచియం, కొత్తూర్, పయ్యోలి తదితర గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.మూజియార్ డ్యామ్ షట్టర్లు పెంచినందున దాని పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పాతనంతిట్ట జిల్లా అధికారులు కోరారు.
ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడం, వాహనాలు సరిగా కనిపించకపోవడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment