లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో బీజేపీ నేత నివాసంలో జరిగిన బర్త్‌డే పార్టీలో కలకలం రేగింది. స్ధానికులు అత్యుత్సాహంతో కాల్పులు జరపడంతో స్టేజ్ సింగర్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. భోజ్‌పురి గాయకుడు గోలు రాజా ఇతర గాయకులతో కలిసి పాటలు పాడుతుండగా ఏడెనిమిది మంది వ్యక్తులు రెండు సార్లు వారిపై గురిపెట్టి కాల్పులు జరిపారు. మహాకల్పూర్ గ్రామంలో జిల్లా బీజేపీ యువమోర్చా నేత భానూ దూబే నివాసంలో జరిగిన తన కుమారుడి బర్త్‌డే పార్టీలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ వీడియోలో గోలు రాజా వేదికపై పాడుతుండగా రెండుసార్లు కాల్పులు జరగడంతో ఆయన ఉలిక్కిపడి ఒక్క ఉదుటున వేదిక నుంచి పరుగెత్తే దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ రాజా కడుపులోకి, మరో బుల్లెట్ ఆయన చేతిలోకి దూసుకెళ్లిందని బలియా ఎస్పీ దేవేంద్ర నాథ్ వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన గాయకుడిని వారణాసి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, లైసెన్స్డ్ రివాల్వర్ నుంచి రాజాపై కాల్పులు జరిపారని ఎస్పీ తెలిపారు. చదవండి : హథ్రాస్ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment