ప్రయాణికులారా.. జాగ్రత్త, మార్గమధ్యలో ఎప్పుడైనా రాళ్ల దాడి జరిగే ప్రమాదం ఉంది.. అని ప్రకటన చేరిస్తే బాగుండుననే చలోక్తులు వ్యాప్తిలో ఉన్నాయి. అంతగా రాళ్ల దాడులు రైల్వేశాఖకు సమస్యగా మారాయి. ప్రయాణంలో ఆదమరిచి ఉన్నవారు.. దుండగులు రాళ్లు విసురుతున్నారని తెలిసి భయాందోళనకు గురికావాల్సి వస్తోంది.
సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై ఆకతాయిల రాళ్ల దాడులు పరిపాటిగా మారాయి. ఇలాంటి తరహా ఘటనలు రాష్ట్రంలోనూ ఎక్కువగా జరుగుతున్నాయి. వందేభారత్ రైళ్లకు మాత్రమే కాకుండా మిగతా రైళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే శాఖకు ఈ పరిణామాలు పెద్ద తలనొప్పిగా మారాయి.
వందేభారత్‌పై గురి
ఇటీవల బెంగళూరు–ధార్వాడ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం అయింది. ప్రారంభం అయిన 15 రోజుల్లోనే సుమారు మూడు సార్లు వందేభారత్ రైలు రాళ్ల దాడికి గురయింది. రాళ్లు తగిలి రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ రాళ్లు తగలకపోవడంతో హాని జరగలేదు. కానీ రాళ్ల దాడుల వల్ల భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని నైరుతి రైల్వే, దక్షిణ రైల్వే, కొంకణ్ రైల్వే జోన్లలో రాళ్లు విసరడం మామూలుగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు చెన్నై–మైసూరు, బెంగళూరు–ధార్వాడ మధ్య రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లు ఇప్పటివరకు 24 సార్లు రాళ్ల దాడులకు గురయ్యాయి. ఇతర రైళ్లు కూడా 190కి పైగా రాళ్ల దాడులకు గురయ్యాయి.
పట్టుబడితే కఠినచర్యలు
గడిచిన ఏడు నెలల్లో నైరుతి రైల్వేజోన్ పరిధిలో 65కు పైగా సాధారణ రైళ్లపై దాడి జరిగింది. రెండుసార్లు ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో కలబురిగిలో ప్యాసింజర్ రైలుపై కూడా దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ప్రమాదంలో ఆశా కార్యకర్త ఒకరు గాయపడ్డారు. మరోవైపు రైల్వే చట్టం 152, 153 సెక్షన్ల ప్రకారం రాళ్ల దాడి శిక్షార్హమైన నేరం. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని నైరుతి రైల్వే హెచ్చరిస్తోంది. ఇటీవల దావణగెరెలో దాడికి పాల్పడిన ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో 200కు పైగా ఇలాంటి తరహా ఘటనలు జరిగాయి. సుమారు 49 మంది నిందితులను అరెస్టు కూడా చేశారు. పనీపాట లేని ఆకతాయిలు, మద్యం, గంజాయి వ్యసనపరులు పొంచి ఉండి రాళ్ల దాడులు చేస్తున్నట్లు, ప్రజలకు హాని చేయాలనే ఉన్మాద మనస్తత్వం ఉన్నవారు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు అంచనా. రైల్వే పోలీసులు గస్తీ ముమ్మరం చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment