న్యూఢిల్లీ: ఆగస్ట్ 6వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మొదటి రోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం నామినేషన్ వేసిన ఐదుగురిలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఆనంద్ సింగ్ కుష్వాహా అలియాస్ రామాయణి చాయ్‌వాలా కూడా ఉన్నారు. ఈయన నామినేషన్‌ను స్వీకరించినప్పటికీ రూ.15 వేల సెక్యూరిటీ డిపాజిట్ అందజేయలేదని అధికారులు తెలిపారు.
తమిళనాడుకు చెందిన శ్రీముఖలింగం నామినేషన్ పత్రాలతోపాటు ఓటర్ జాబితాలో పేరున్నట్లు తెలిపే సర్టిఫికెట్ ఇవ్వనందున తిరస్కరించామన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కె పద్మరాజన్, అహ్మదాబాద్‌కు చెందిన పరేష్‌కుమార్ నానుభాయ్ ములానీ, బెంగళూరు నివాసి హోస్మత్ విజయానంద్ నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, రామాయణి చాయ్‌వాలా.. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లోనూ పలుమార్లు నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. 24 పర్యాయాలు ఆయన ఎన్నికల్లో పోటీకి నిలిచినట్టు తెలుస్తోంది.
నామినేషన్ల దాఖలుకు ఈనెల 19 ఆఖరు తేదీ. జూలై 20న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 22 చివరి తేదీ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. నామినేటెడ్ సభ్యులతో సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటు వేయడానికి అర్హులు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. తదుపరి ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటివరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ప్రకటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. (క్లిక్: కేంద్రంపై కోర్టుకెక్కిన ట్విట్టర్)
Comments
Please login to add a commentAdd a comment