కరోనా దెబ్బతో మాస్కుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. జేబులో పర్సు లేకుండా కాలు బయట పెడుతున్నారేమో గానీ ముఖానికి మాస్కు లేకుండా జనావాసాల్లోకి మాత్రం రావడం లేదు. అయితే సుమారు రెండు నెలలుగా మహమ్మారి ప్రభావం పెద్దగా లేకపోవడంతో జనాల్లో భయం వీడింది. నిబంధనలు పాటించకుండానే విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఈ క్రమంలో ముఖానికి మాస్కు ధరించలేదని అడ్డుకున్నందుకు మున్సిపల్ కార్మికురాలి చెంప చెళ్లుమనిపించింది ఓ మహిళ. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మహారాష్ట్రలో కోవిడ్ కేసులు అధికమవుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని ప్రజలందరు కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ముంబైలో మాస్కు ధరించకుండా బయటకు రావడం నిషేదం. ఇందుకు 200 రూపాయల జరిమానా కూడా విధిస్తోంది.
ఈ నేపథ్యంలో ఓ మహిళ మాస్కు ధరించకుండా ఆటోలో వెళుతూ మున్సిపల్ సిబ్బంది కంటపడింది. ముంబైలోని కండివాలి రోడ్‌లో ఆటో రిక్షాలో మాస్కు ధరించకుండా ప్రయాణిస్తున్నా మహిళను బృహాన్ ముంబై కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కార్మికురాలు అడ్డుకుంది. మాస్కు ధరించాలని, లేకుంటే 200 రూపాయల ఫైన్ కట్టాలని కోరింది. ఈక్రమంలో వీరిద్దరి మధ్య కొద్దిసేపు వాదన సాగింది. నన్నే ఆపుతావా అని ఆగ్రహించిన మహిళా.. సదరు కార్మికురాలిపై చేయి చేసుకుంది. దీంతో మహిళను వెళ్లనివ్వకుండా గట్టిగా పట్టుకోడంతో బీఎంసీ కార్మికురాలిపై మహిళా తన ప్రతాపం చూపించింది. ఆటోలో నుంచి బయటకు దిగి వర్కర్‌పై దాడి చేసింది. ‘నన్ను ఆపడానికి నీకు ఎంత ధైర్యం, నన్నే ముట్టుకుంటావా అంటూ మహిళపై పిడిగుద్దులు గుద్దుతూ, కాలితో ఇష్టం వచ్చినట్లు తన్నింది.
ఈ దృశ్యాలన్నింటిని ఓ వ్యక్తి తన మోబైల్‌లో వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా ముంబైలోని చార్‌కోప్ పోలీసులు చార్కోప్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని బీఎంసీ పర్యవేక్షకుడు ప్రశాంత్ కాంబ్లే తెలిపారు. కాగా రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 25,681 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక కేసులు నమోదవ్వడం. గురువారం కూడా 25,853 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మరోసారి రాష్ట్రంలో కఠినమైన లాక్‌డౌన్ విధిస్తామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి వైరస్ కట్టడికి సహకరించాలని కోరారు. థియేటర్లలు, ఆడిటోరియాలు, ప్రైవేటు కార్యాలయాలలు ఇక నుంచి 50 శాతం సామర్థ్యంతో కొనసాగించాలని ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 31 వరకు కొనసాగుతాయిన పేర్కొన్నారు.
చదవండి: వ్యాక్సిన్ అందరికీ అక్కర్లేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment