రాయపూర్: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సీఎం బఘేల్ ఆదివారం ఉదయం ఇక్కడి మహాదేవ్‌ఘాట్ వద్ద ఖరున్ నదిలో పవిత్ర స్నానం చేసి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసమంతా సూర్యోదయానికి ముందు స్నానం చేయడం ఛత్తీస్‌గఢ్‌లో ఆచారంగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా తాను కూడా మహదేవ్‌ఘాట్‌లో దిగి ఖరున్ నదిలో స్నానం చేసినట్లు చెప్పారు. సూర్యోదయానికి ముందు స్నానం చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదని ఆయన పేర్కొన్నారు.
సుప్రీం నిర్దేశంతోనే..
అయోధ్యలో రామ మందిర నిర్మాణం తుది దశలో ఉంది. వచ్చే జనవరి 22న ప్రతిష్ఠాపన జరగనున్న ఈ రామ మందిరం వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ప్రధాన అంశంగా మారింది. దీనిపై ఛత్తీస్‌గఢ్ సీఎం మాట్లాడుతూ “సుప్రీం కోర్టు నిర్దేశంతోనే అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. కానీ బీజేపీ దాని మీద రాజకీయం చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో చాలా చోట్ల మేమూ అనేక రామ మందిరాలు నిర్మించాం. కానీ మేము వాటి పేరు మీద ఓట్లు అడగడం లేదు’ అన్నారు.
తెలంగాణలో ప్రచారం
మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నానని, ఇందు కోసం రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తానని బఘేల్ తెలియజేశారు. తెలంగాణలో నవంబర్ 30న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం రాజస్థాన్‌లో జరిగిన పోలింగ్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదవడం వెనుక అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలు ఉన్నాయన్నారు. కాగా నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు (Chhattisgarh Assembly Elections) పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment