ఔరంగాబాద్: దాదాపు పది ఎకరాల భూమి ఉన్నా పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెగ వాపోయాడు ఓ పెళ్లికాని ప్రసాద్. తెలిసిన వారందరినీ వధువు కోసం ఆరాతీసి విసిగిపోయిన ఆ అవివాహితుడు చివరకు ఏకంగా తమ నియోజకవర్గం ఎమ్మెల్యేకే ఫోన్ చేసి బాధపడిపోయాడు. మీరైనా పెళ్లికి సరిజోడీని వెతికిపెట్టండి సారూ అంటూ ఫోన్‌లోనే విన్నపాలు వినిపించాడు.
అతని బాధను అర్థ్ధంచేసుకున్న ఆ ఎమ్మెల్యే పెళ్లిళ్ల పేరయ్యగా మారేందుకూ సిద్ధమయ్యాడు. వెంటనే బయోడేటా పంపించు.. పెళ్లికి అమ్మాయిని వెతికిపెట్టే పూచీ నాదీ అంటూ హామీ ఇచ్చాడు. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఓటరుకు మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. మహారాష్ట్రలోని కన్నాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్‌కు అక్కడి ఖుల్తాబాద్ వాస్తవ్యుడికి మధ్య ఈ సంభాషణ జరిగింది.
ఉదయ్‌సింగ్.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన చీలికవర్గానికి మద్దతు ఇస్తున్నారు. పెళ్లికాని ఓటరు ఫోన్‌కాల్‌పై మీడియా ప్రశ్నించగా ఎమ్మెల్యే సమాధాన మిచ్చారు. ‘ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాస్తవిక సమస్య ఇది. ఓ 2,000 మంది జనాభా ఉన్న గ్రామాన్ని తీసుకుంటే అందులో ఖచ్చితంగా 150 మంది యుక్తవయసు అబ్బాయిలు పెళ్లిళ్లుకాక ఇబ్బందులు పడుతున్నారు. 100 ఎకరాల భూస్వామి అయినా సరే వధువు కోసం తిప్పలు పడాల్సిందే. పట్టణప్రాంతాల్లో స్ధిరపడిన అబ్బాయిలవైపు అమ్మాయిల తల్లిదండ్రులు మొగ్గుచూపడమే ఇక్కడ అసలు సమస్య. పెళ్లి కావట్లేదు బాబోయ్ అంటూ నాకు ఇలాగే చాలా మంది ఫోన్లు చేశారు’ అని ఎమ్మెల్యే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment