జైపూర్: అతను తన క్రేజీ వీడియోలతో దేశంలోనే అత్యధిక ఆదాయం అర్జిస్తున్న యూట్యూబర్‌లలో ఒకడు. ఉన్నత చదువులు చదివాడు. ఆ చదువుకు తగ్గట్లు మంచి ప్యాకేజీతో ఉద్యోగం దక్కదే. కానీ, విచిత్రంగా యూట్యూబ్ వీడియోల వైపు ఆసక్తి చూపించాడు. అది అతనికి కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతోంది. అయితే.. చివరికి వ్యూస్ కోసం చేసిన యత్నమే ఆ యూట్యూబర్ ప్రాణం మీదకు తెచ్చింది.
24 ఏళ్ల వయసున్న అమిత్ శర్మ.. రాజస్థాన్‌లో టాప్ యూట్యూబర్. అల్వార్ అతని స్వస్థలం. ఐఐటీ రూర్కీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నం చేయకుండా.. యూట్యూబ్ ఛానెల్ వైపు అడుగులు వేశాడు. క్రేజీ ఎక్స్‌వైజెడ్ అనే పేరుతో గత ఐదేళ్లుగా ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు అతను. స్నేహితుల సహకారంతో నడిపిస్తున్న ఆ ఛానెల్‌కు 25 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు కూడా. ఈ ఛానెల్ ద్వారా నెలకు అతని సంపాదన రూ. 9 కోట్లు అని, అన్‌బాక్సింగ్(కొత్త ప్రొడక్టుల డెమో, రివ్యూల) ద్వారా అతని ప్రత్యేక ఛానెల్ ద్వారా నెలకు మరో రూ.2.5 కోట్లు సంపాదిస్తున్నాడంటూ అక్కడి మీడియా ఛానెల్స్ కథనాలు ప్రచురిస్తుంటాయి. అయితే..
సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ మీద వీడియోలు తీసే అమిత్ శర్మ.. తాజాగా కాలనాగుతో ఓ వీడియో తీయాలని యత్నించాడట. ఆ ప్రయత్నంలోనే అది వేలిని కాటేసింది. కాసేపు అతను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట. ఆపై విషం శరీరానికి వ్యాపించడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. బాడీ మొత్తం పాము విషం వ్యాపించడంతో చావు బతుకుల్లో ఉన్నట్లు అతని స్నేహితులు ఓ వీడియోను పోస్ట్ చేశారు.
అతను ప్రాణాపాయం నుంచి బయటపడాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని వ్యూయర్స్‌ను, సబ్‌స్క్రయిబర్స్‌ను కన్నీళ్లతో వాళ్లు కోరారు. అమిత్ శర్మ వీడియోలకు అక్కడ క్రేజ్ ఉంది. అతను బతకాలని, త్వరగా కోలుకుని మళ్లీ వీడియోలు తీయాలని అతని ఫాలోవర్స్ పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment