గుండంపల్లి శివారులో గోదావరి వద్ద ఎత్తిపోతల పథకం
నిర్మల్: తలాపున గోదారి పారుతున్నా.. బీళ్లుగా మారిన భూములను చూసి దిగాలు చెందుతున్న రైతుల కల సాకారం కాబోతోంది. గంగనీళ్ల కోసం నిరీక్షిస్తున్న భూములు సస్యశ్యామలం కాబోతున్నాయి. బీడు భూముల్లో జల దృశ్యం సాక్షాత్కారం కాబోతోంది. అపర భగీరథుడిగా గుర్తింపు పొందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2008లో ప్రారంభించిన పథకం ఎట్టకేలకు నీరు అందించబోతోంది.
గలగల పారేటి గంగమ్మ రైతుల భూములకు మళ్లనుంది. ఏళ్లుగా ఊరిస్తున్న గోదావరి నీళ్లను దిలావర్‌పూర్ మండలం గుండపల్లి వద్ద ఎత్తిపోసేందుకు ‘శ్రీలక్ష్మీనర్సింహుడు’ సిద్ధమయ్యాడు. కాళేశ్వరం పథకంలో నిర్మించిన లిఫ్ట్‌ద్వారా జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంచి. మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ప్యాకేజీ–27ను ప్రారంభించనున్నారు.
ఎట్టకేలకు ‘సమీకృతం’..
వెజ్, నాన్‌వెజ్, కూరగాయలు, పూలు, పండ్లు ఇలా అన్నీ ఒకేచోట దొరికేలా నిర్మల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంతంలో నిర్మించనున్నారు. పాత కార్యాలయాన్ని కూల్చివేసి, దాని వెనుకే ఉన్న సిపాయిల బా వి ప్రాంతాన్ని కలుపుకుంటూ మొత్తం 2.30 ఎకరాల విస్తీర్ణంలో రూ.10.15కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈనిర్మాణంలో కింద 136 కూరగాయల దుకాణాలు, మొదటి అంతస్తులో 34 నాన్‌వెజ్ షాపులు, నిత్యావసరాల సరుకుల కోసం మరో 18 కమర్షియల్ షాపులు ఉండేలా నిర్మించనున్నారు.
2008లో మొదలై..
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల పథకంలో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి జిల్లాలోని ఆయకట్టుకు లిఫ్ట్ ద్వారా నీరందించేందుకు ఈ పథకం ప్రారంభించారు. వైఎస్సార్ మరణం, తర్వాత పరిణామాలతో పనులు ఆగిపోయాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాణహిత–చేవెళ్లను కాళేశ్వరం పథకంగా పేరు మార్చి, ఈ పథకం కింద నిర్మల్ నియోజకవర్గంలో ప్యాకేజీ–27 ద్వారా 50 లక్షల ఎకరాలు, ముధోల్ నియోజకవర్గంలో ప్యాకేజీ–28 ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా మార్పులు చేశారు.
రూ.714 కోట్లతో..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.714 కోట్ల వ్యయంతో ప్యాకేజీ–27 చేపట్టారు. దిలావర్‌పూర్ మండలం గుండపల్లి వద్ద గోదావరిలో పంప్‌హౌస్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఇదే మండలంలో మాడేగాం గుట్టవద్ద నిర్మించిన డెలివరీసిస్టర్న్ వద్దకు ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోస్తారు.
ఎనిమిది మండలాలకు సాగునీరు..
ఈ డెలివరీ సిస్టం(కుండీ) నుంచి నిర్మల్‌వైపు 13.50 కి.మీ పొడవు 100 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువ, కుంటాల మండలం వైపు 29.50 కి.మీ. పొడవు 140 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎడమకా లువ నిర్మించారు. దిలావర్‌పూర్, నర్సాపూర్(జి), కుంటాల, సారంగాపూర్, నిర్మల్, లక్ష్మణచాంద, సోన్, మామడ మండలాల పరిధిలోని చెరువులు, కుంటలకు నీరందించేలా రూపకల్పన చేశారు.
యూనిట్ – 2 ద్వారా ప్రాజెక్టుల్లోకి..
ఇదే డెలివరీ సిస్టం నుంచి దోనిగాం ప్రాజెక్ట్, స్వర్ణ ప్రాజెక్ట్‌లను నింపడానికి కూడా గుట్ట కింది నుంచి టన్నెల్, కెనాల్‌ను నిర్మించారు. ఇక మాడేగాం గుట్టమీది గ్రామాలకూ నీరందించేందుకు ప్రత్యేకంగా యూనిట్–2 పంప్‌హౌస్‌ను నిర్మించారు. ఈ పంప్‌హౌస్ ద్వారా 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నీరందించేందుకు 7.50 కిలోమీటర్ల పొడవున ఎడమ, 3.75 కిలోమీటర్ల పొడవున కుడి కాలువలను నిర్మించారు. రెండు కాలువల ద్వారా ఐదు వేల ఎకరాలకు నీరందించనున్నారు.
యూనిట్ – 3 ద్వారా..
యూనిట్–3గా మూడో పంప్‌హౌస్‌ను కడ్తాల్ గ్రామం వద్ద సరస్వతీ కెనాల్ ద్వారా నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. ఈ నీళ్లు మేడిపల్లి శివారులో ఎడమ కాలువ ద్వారా 17.5 కిలోమీటర్లు, కుడి కాలువ ద్వారా 1.9 కిలోమీటర్లు ప్రవహించనున్నాయి. కాల్వ లక్ష్మీనర్సింహస్వామి పేరు మీదుగా ప్రారంభమయ్యే ప్యాకేజీ–27 ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం 50 వేల ఎకరాలకు నీరందించేలా ప్లాన్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చొరవ, సీఎం కేసీఆర్ సహకారం ప్రస్తుతం ప్రధాన కాలువ ద్వారా నీరందించే వరకు వచ్చింది. మంత్రి కేటీఆర్ నీటి విడుదలను ప్రారంభించిన తర్వాత మరిన్ని నిధులిస్తారని, రైతుల భూముల దాకా నీరందించే డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తవుతాయని ఆశిస్తున్నారు.
ఇవి కూడా..
నిర్మల్ జిల్లాకేంద్రంలో రూ.23.91 కోట్లతో చేపట్టిన మిషన్‌భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీటి సరఫరా మంత్రులు ప్రారంభిస్తారు. టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.2 కోట్లతో దోబీ ఘాట్, రూ.4 కోట్లతో మౌలిక వసతులు, రూ. 50కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అమృత్ పథకంలో తాగునీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.62.50 కోట్లతో, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.25 కోట్లతో చేప్టటే వివిధ పనులను ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment