నిర్మల్: పట్టణంలోని పలు జిన్నింగ్ మిల్లులతోపాటు పెట్రోల్‌బంక్‌లో తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు గురువారం జరిపిన తనిఖీలు అనుమానాలకు తావిస్తున్నాయి. కాంటాలకు(వేబ్రిడ్జి), పెట్రోల్‌బంక్ యంత్రాలకు స్టాంపింగ్ వేసేందుకు వచ్చిన సదరు జిల్లా ఇన్‌చార్జి అధికారి తన అధికారిక వాహనం దిగకుండానే మమ అనిపించారు. ఆమె వెంట వచ్చిన డ్రైవర్, టెక్నీషియన్ మాత్రమే కాంటాలకు ఉన్న పాత సీల్ తొలగించి కొత్త సీల్ వేశారు. ఎలాంటి పత్రాలు పరిశీలించకుండానే సీల్ వేయడం, తీరా సీల్ వేశాక కూడా సంబంధిత పత్రాలు అందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు ఇలా..
నిబంధనల ప్రకారం కొత్త స్టాంపింగ్ వేసే సమయంలో కాంటాలపై తూకం బాట్లు పెట్టి మాన్యువల్‌గా తనిఖీ చేయాలి. కానీ ఇన్‌చార్జి అధికారి అలాంటిదేమీ లేకుండా నామమాత్రంగా సీల్ వేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి.
తూకాల్లో ఎలాంటి మోసాలు జరుగకుండా రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు.. ఇలా కాంటాలకు స్టాంపింగ్ వేయడంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత తూనికలు, కొలతల అధికారి భూలక్ష్మిని కలిసి వివరణ కోరగా, తాను భైంసాలోని పెట్రోల్‌బంక్‌లో స్టాంపింగ్ గడువు ముగియడంతో వారి అభ్యర్థన మేరకు మాత్రమే వచ్చానని తెలిపారు. మరెక్కడా స్టాంపింగ్ చేయలేదని పేర్కొన్నారు. కాగా, జిన్నింగ్ మిల్లుల్లో సైతం స్టాంపింగ్ చేశారు కదా అని ప్రశ్నించగా, సమాధానం దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment