ఖలీల్‌వాడి : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు ఖాళీ అయి రెండు నెలలు గడుస్తున్నా నియామకం జరగడం లేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడమే కారణంగా విమర్శలు వస్తున్నాయి. పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కేఆర్ నాగరాజు పదవీ విరమణ చేయడంతో ఈ పోస్టు ఖాళీ అయ్యింది. నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు నెలలుగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ పోలీసు కమిషనర్ నియామకానికి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు వేర్వేరుగా ఇద్దరు పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఒకరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన పోలీస్ అధికారిని, మరొకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారిని నియమించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇద్దరు బలమైన ప్రజాప్రతినిధులు ప్రపొజల్స్ పంపడంతో పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నట్లు సమాచారం. ఎన్నికల గడువు సమీపించడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా వ్యవహరించే కమిషనర్ కావాలని జిల్లాలోని ప్రధాన ప్రజాప్రతినిధులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. జిల్లాలో ఎస్సై, సీఐ తదితర పోస్టులకు సదరు ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలు లేనిదే పోలీస్‌స్టేషన్‌లలో పోస్టులు భర్తీ కావడంలేదనే చర్చ పోలీస్‌శాఖలో సాగుతోంది.
ఇప్పుడు వచ్చే పోలీస్‌కమిషనర్ రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉండే సీపీ ఉంటే బాగుంటుందని చర్చించినట్లు తెలిసింది. దీంతో కొత్త కొత్వాల్ కోసం మల్లాగుల్లాలు పడుతున్నట్లు సామాచారం. ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేసిన వారిని కాకుండా సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.
గతంలో సదరు ఐపీఎస్ అధికారి నిజామాబాద్ సీపీ పోస్టు కోసం ప్రయత్నం చేసినప్పటికీ కేఆర్ నాగరాజుకు అవకాశం లభించినట్లు తెలిసింది. దీంతో మరోసారి సదరు ఐపీఎస్ అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పోలీస్‌స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారులకు చెపుకుందామంటే అవకాశం లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment