సొంత ఊరిలో వార్డు మెంబర్‌గా ఓడి.. ఎమ్మెల్యేగా విజయం | - | Sakshi
Sakshi News home page

సొంత ఊరిలో వార్డు మెంబర్‌గా ఓడి.. ఎమ్మెల్యేగా విజయం

Published Sun, Oct 29 2023 1:14 AM | Last Updated on Sun, Oct 29 2023 1:54 PM

ఆర్థికశాఖమంత్రిగా అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న శనిగరం సంతోష్‌రెడ్డి (ఫైల్‌) - Sakshi

ఆర్థికశాఖమంత్రిగా అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న శనిగరం సంతోష్‌రెడ్డి (ఫైల్‌)

ఒకప్పుడు వార్డు మెంబర్‌గా ఓడి.. ఎమ్మెల్యేగా విజయం సాధించిన శనిగరం సంతోష్‌రెడ్డి రాష్ట్ర ఆర్థికశాఖ, భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా సేవలందించారు. జిల్లా రాజకీయాలపై తనదైన ముద్రవేసిన సంతోష్‌రెడ్డి.. 1969లో అర్గుల్‌ రాజారాంతో కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి జైలు జీవితాన్ని గడిపారు.

ఆర్మూర్‌: విద్యార్థి నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శనిగరం సంతోష్‌రెడ్డి తన రాజకీయ జీవితాన్ని స్వగ్రామమైన భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్‌ నుంచి ప్రారంభించారు. సొంత ఊరిలో వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. తరువాతి కాలంలో ఎమ్మెల్యేగా గెలుపొంది ఆర్థిక, భారీ పరిశ్రమలు తదితర శాఖలకు మంత్రిగా పనిచేసి రాష్ట్రస్థాయిలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మృదుస్వభావిగా, రాజకీయ చతురినిగా గుర్తింపు పొందిన సంతోష్‌రెడ్డి.. నాలుగు పర్యాయాలు ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

► 1964 – 65లో కళాశాల విద్యనభ్యసిస్తున్న రోజుల్లో నిజామాబాద్‌ గిరిరాజ్‌ కాలేజీ జనరల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1966 – 67 కాలంలో కళాశాల అధ్యక్షుడిగా కొనసాగారు. బడుగు, బలహీనవర్గాల నేత, మాజీ మంత్రి అర్గుల్‌ రాజారాం, తన బావ అయిన స్వాతంత్య్ర సమరయోధుడు బీఆర్‌ గంగారెడ్డి స్ఫూర్తి, ప్రోద్భలంతో సంతోష్‌రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

► 1969లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అర్గుల్‌ రాజారాంతో కలిసి ఉద్యమించి జైలు జీవితాన్ని సైతం గడిపారు.

► 1970లో తన స్వస్థలమైన భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్‌ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

► 1971లో జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, నిజామాబాద్‌ బీడీ మజ్దూర్‌ సంఘ్‌ జనరల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు.

► 1975లో యువజన కాంగ్రెస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా నియమితులయ్యారు. తన రాజకీయ గురువుల సహకారంతో 1978లో కాంగ్రెస్‌ తరఫున ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అదే ఏడాది మొట్టమొదటి సారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. సినీ నటుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా తెలుగుదేశం అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందారు. ఆ సమయంలో సంతోష్‌రెడ్డి ఆర్మూర్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు.

► 1985లో టీడీపీ అభ్యర్థి ఏలేటి మహిపాల్‌రెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు.

► 1989లో టీడీపీ అభ్యర్థి వేముల సురేందర్‌రెడ్డిపై విజయం సాధించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

► 1990 – 91వరకు రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా, 1991 – 92 వరకు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్‌లో ఆర్థికశాఖ మంత్రిగా, 1992 – 93 వరకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్‌లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

► 1994లో టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మపై చేతిలో ఓటమి పాలయ్యారు.

► 1999లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 3,500 స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. ప్రత్యేక తెలంగాణసాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌లో భీమ్‌గల్‌ జెడ్పీటీసీగా గెలుపొందారు. మెజార్టీ సభ్యుల బలంతో నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2004 ఎన్నికల్లో జడ్పీ చైర్మన్‌ పదవికి రాజీనామ చేసిన సంతోష్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ నుంచి ఆర్మూర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్‌ఎస్‌లో అసమ్మతి బాటపట్టి కాంగ్రెస్‌ వాదిగా కొనసాగారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన తన పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇకముందు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని సంతోష్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరకున్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఉన్న సత్సంబంధాలతో తన తనయుడు శనిగరం శ్రీనివాస్‌రెడ్డి(వాసు)ని 2009 ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీకి నిలిపారు. ఓటమి పాలవడంతో శ్రీనివాస్‌రెడ్డి అమెరికాకు వెళ్లిపోయారు.

అయినా సంతోష్‌రెడ్డి తన అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో విభేదించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తిరిగి దిగ్విజయ్‌సింగ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించకపోవడంతో నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement