గాడిద పాలను విక్రయిస్తున్న మహిళ
భిక్కనూరు: గంగి గోవుపాలు గరిటైడెనను చాలు.. కడివడైననేమి కరము పాలు.. ఇది ఒకప్పుడు అందరూ చదువుకున్న పద్యపాదం. ఆవు పాల ముందర గాడిద పాలు ఎందుకూ పనికిరావని దీని అర్థం. అయితే పరిస్థితి మారిపోయింది. గాడిద పాలకే ఎక్కువ డిమాండ్ వచ్చింది. పిల్లల దగ్గు, ఆయాసం తగ్గడానికి వీటిని వినియోగిస్తుండడంతో లీటరు పాటు రూ. 1600 నుంచి రూ. 2 వేల వరకు పలుకుతోంది.
పది మిల్లీలీటర్ల పాలు పిల్లలకు తాపితే దగ్గు, ఆయాసం, ఆకలి లేకపోవడం వంటి వ్యాధులు నయమవుతాయని గ్రామ ప్రజల నమ్మకం. దీంతో 25 ఎంఎల్ పాలు రూ. 40 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. రెండు రోజులుగా మండల కేంద్రంలో గాడిద పాల వ్యాపారులు తిరుగుతూ పాల వ్యాపారం చేస్తున్నారు. వారు అమ్మే ధరను చూస్తే లీటరు గాడిద పాలు రూ. 2 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా కామారెడ్డిలో నివాసం ఉంటూ మండల కేంద్రాల్లో గాడిద పాల వ్యాపారం చేస్తున్న రాధను ‘సాక్షి’ పలుకరించగా గ్రామాల్లో తిరుగుతూ పాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. గాడిద పాలు చిన్నపిల్లలకు తాగిపిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. తనకున్న గాడిదల పాల వ్యాపారం ద్వారా రోజుకు రూ. వెయ్యి వరకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment