కాంగ్రెస్‌ మాటకు కట్టుబడి ఉంటుంది | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మాటకు కట్టుబడి ఉంటుంది

Published Tue, May 7 2024 10:50 AM

కాంగ్రెస్‌ మాటకు కట్టుబడి ఉంటుంది

భీమ్‌గల్‌: వచ్చే ఖరీఫ్‌ నాటికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. భీమ్‌గల్‌, బడా భీమ్‌గల్‌లో సోమవారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లలో జీవన్‌రెడ్డితోపాటు బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, తమ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత బస్సుసౌకర్యం, గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తామన్నారు. గల్ఫ్‌లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని, రూ.5 లక్షల ఆర్థిక సహాయం కాంగ్రెస్‌ ద్వారా అందిస్తామ ని తెలిపారు. కేసీఆర్‌కు పెద్ద కొడుకునని చెప్పుకునే ప్రశాంత్‌రెడ్డి 21 ప్యాకేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిస్తే ఏడాదిలోగా 21 ప్యాకేజీ పూర్తి చేసి, రైతులకు నీరు అందిస్తానని, భీమ్‌గల్‌ బస్‌ డిపోను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. జీవితంలో చివరి అంకానికి వచ్చానని, ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. ముత్యాల సునీల్‌ మాట్లాడుతూ.. మచ్చలేని నాయకుడు జీవన్‌రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని అన్నారు.

ఖరీఫ్‌ నాటికి రూ.2లక్షల రుణమాఫీ

భీమ్‌గల్‌ బస్‌ డిపోను పునరుద్ధరిస్తాం

కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి

Advertisement
 
Advertisement