నో పర్మిషన్‌.. అయినా అడ్మిషన్‌..! | Sakshi
Sakshi News home page

నో పర్మిషన్‌.. అయినా అడ్మిషన్‌..!

Published Tue, May 7 2024 10:55 AM

నో పర్మిషన్‌.. అయినా అడ్మిషన్‌..!

కనీస సౌకర్యాలు కరువు

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలో ప్రయివేటు పాఠశాలలు, ప్లే స్కూల్స్‌ విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండానే స్కూళ్లను నడుపుతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. అధికారులను మచ్చిక చేసుకుని పాఠశాలలను కొనసాగిస్తున్నాయి. ఇలా అనుమతి లేని పాఠశాలలు, ప్లే స్కూల్స్‌ విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి.

తల్లిదండ్రులను మోసం చేస్తున్న స్కూళ్లు

జిల్లాలో ప్రయివేటు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతూ విద్యార్థులను వారి తల్లిండ్రులను మోసం చేస్తున్నాయి. ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌, కంఠేశ్వర్‌, సుభా ష్‌నగర్‌ ప్రాంతంలో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రయివేటు పాఠశాలలకు అనుమతి లేదు. వినాయక్‌నగర్‌లో ఓ కార్పోరేట్‌ పాఠశాలకు 8 నుంచి 10 వరకు పర్మిషన్‌ లేదు. ఆటోనగర్‌లో ఆరేళ్లుగా ఓ ప్రైవేటు పాఠశాల 6 నుంచి 10 వరకు అనుమతి లేకుండా కొనసాగుతోంది. ఇదే ప్రాంతంలో మరో పాఠశాల షిఫ్టింగ్‌ అనుమతి లేకుండా నడుస్తోంది. అలాగే ఈ ఏడాది జిల్లాలో కొత్తగా 15 వరకు ప్లేస్కూల్స్‌ ఏర్పడ్డాయి. కానీ వీటికి మాత్రం ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ముందస్తుగా జిల్లా విద్యాశాఖ అధికారి, లేదా సంబంధిత మండల విద్యాశాఖ అధికారి అనుమతి పొందాల్సి ఉంటుంది. అధికారుల పరిశీలన అనంతరం అనుమతి మంజూరు చేస్తారు. కానీ నిబంధనలు ఏమీ లేకుండానే నివాస భవనాలను ఎంపిక చేసుకొని కొందరు ప్లే స్కూల్స్‌ కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్‌లో ఈ ఏడాది కొత్తగా రెండు ప్లేస్కూల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇవి కూడా పరిష్మన్‌ లేకుండానే కొనసాగుతున్నాయి. వీటిలో 40 నుంచి 50 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. కంఠేశ్వర్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తీసుకొని స్కూల్‌ కొనసాగిస్తుండగా దీని కి అనుమతి లేదు. సుభాష్‌నగర్‌లో ఓ ప్రభుత్వ టీచర్‌ ఇల్లు అద్దెకు తీసుకొని పర్మిషన్‌ లేకుండా ప్లే స్కూల్‌ నిర్వహిస్తున్నాడు. ఆర్మూర్‌లో రిటైర్డ్‌ టీచర్‌ మూడేళ్లు అనుమతి లేకుండా ప్లేస్కూల్‌ను నడుపుతున్నాడు. నిజామాబాద్‌ నగర శివారులో రెండు ప్రయివేటు పాఠశాలలు భవనాలు లేకున్నా, అను మతి లేకున్నా అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి.

జిల్లాలో విచ్చలవిడిగా

ప్రయివేటు పాఠశాలల ఏర్పాటు

అనుమతులు లేకున్నా పిల్లలను చేర్చుకుంటున్న ప్లే స్కూల్స్‌

నిబంధనలు బేఖాతరు చేస్తున్న

యాజమాన్యాలు

జిల్లాలో కొన్ని ప్లేస్కూళ్లను నివాస భవనాల్లో కొనసాగిస్తుండగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవు. నగరంలోని ఆర్మూర్‌ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొనసాగుతున్న స్కూల్‌లో ఒకే గదిలో 40 మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. వీరందరికి ఒకే బాత్‌రూం అందుబాటులో ఉంది. కంఠేశ్వర్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో పాత భవనానికి రంగులు వేసి పాఠశాల నడుపుతున్నారు. మారుతినగర్‌లో మరో ప్లేస్కూల్‌ భవనాన్ని అద్దెకు తీసుకొని రెండు గదుల్లోనే 42 మందికి విద్యార్థులకు చదువు చెబుతున్నారు. విద్యార్థులకు ఆట వస్తువులు, తాగునీరు విడివిడిగా బాత్‌రూంలు అందుబాటులో లేవు. 40 మంది విద్యార్థులు ఉన్న ఒక ఆయా ఇద్దరు లేదా ముగ్గురు టీచర్లతోనే కొనసాగిస్తున్నారు. ఇలా అనేక ప్లే స్కూళ్లు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. విద్యాశాఖ అధికారులకు మమూళ్లు ముట్టజెబుతూ నడిపించేస్తున్నారు. అలాగే వినాయక్‌నగర్‌లో ఓ కార్పోరేట్‌ పాఠశాలకు 8 నుంచి 10వ తరగతి వరకు అనుమతి లేదు. దీనిపై కొందరు విద్యార్థి సంఘ నాయకులు ఎంఈవోకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా జిల్లాలో పాఠశాలలను ఇష్టారాజ్యంగా నడుపుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

చర్యలు తీసుకుంటాం

అనుమతి లేకుండా ప్రయివేటు పాఠశాలలు, ప్లే స్కూ ల్స్‌ కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తల్లిదండ్రులు సైతం అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దు. – దుర్గాప్రసాద్‌, డీఈవో

Advertisement
 
Advertisement