నిగ్గుతేలిన అక్రమం | - | Sakshi
Sakshi News home page

నిగ్గుతేలిన అక్రమం

Published Thu, Jan 30 2025 1:41 AM | Last Updated on Thu, Jan 30 2025 1:41 AM

నిగ్గ

నిగ్గుతేలిన అక్రమం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలోని కోటగిరి మండలం ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రూ.8,80,58,873 మేర అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిగ్గుతేలింది. ఈ విషయమై గతంలో ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి డీసీవో సింహాచలం పాత్రపైనా ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణ చేసిన అధికారులు అక్రమాలు, అవకతవకలను నిర్ధారించారు. తగిన చర్యలకు ఉపక్రమించారు.

వివరాల్లోకి వెళితే.. కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం కోసం ప్రభుత్వం నుంచి ఎత్తొండ సహకార సంఘం ఆధ్వర్యంలోని రైస్‌ మిల్లులకు 2022–23 యాసంగి, 2023–24 వానాకాలం సీజన్లకు కలిపి మొత్తం 29 వేల క్వింటాళ్ల ధాన్యం ఇచ్చారు. అయితే ప్రభుత్వానికి తిరిగి సీఎంఆర్‌ ఇవ్వలేదు. దీని వెనుక భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు వెళ్లాయి.

● కుంభకోణంలో సహకార సంఘం సీఈవో సంతోష్‌, సేల్స్‌మెన్‌లు శ్రీధర్‌, హన్మంత్‌ రావు, ఫణికుమార్‌, దేవరాజు, సేల్స్‌ ఉమెన్‌ మమత ప్రమేయం ఉందనే కారణంతో వీళ్లను క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్‌ చేస్తూ డీసీవో శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల రికవరీ కోసం సర్‌చార్జ్‌ నోటీసులు ఇచ్చారు.

● కీలకమైన అంశం ఏమిటంటే ఎత్తొండ సొసైటీలో చోటుచేసుకున్న కుంభకోణంలో నోటీసులకు సంబంధించిన కాపీలు చూపించేందుకు జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు నిరాకరిస్తున్నారు. కుంభకోణం అధికారిక విచారణలో నిర్ధారణ అయినప్పటికీ గోప్యత పాటించేందుకు ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. పూర్తి వివరాలు వెల్లడిస్తే ఏదో జరిగిపోతుందనే భావన వ్యక్తం చేస్తుండడం విశేషం. ఈ కుంభకోణంలో మాజీ డీసీవో సింహాచలం పాత్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. సింహాచలాన్ని కాపాడేందుకు పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ ప్రభుత్వమే విచారణ చేయించి అక్రమాలు నిగ్గుతేలుస్తుంటే ప్రస్తుత డీసీవో వింత వైఖరితో ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోందని పలువురు అంటున్నారు. డీసీవో శ్రీనివాసరావు కార్యాలయంలో తలుపులు వేసుకుని బయటవైపు తాళం వేయించుకుని లోపల పనిచేసుకుంటుండడం గమనార్హం. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై మరిన్ని విమర్శలు వస్తున్నాయి.

● అక్రమ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎత్తొండ సొసైటీ పాలకవర్గాన్ని సైతం రద్దు చేసేందుకు సహకార శాఖ చర్యలకు దిగింది. సొసైటీ మాజీ చైర్మన్‌ అశోక్‌ పటేల్‌ (కుంభకోణం వెలుగులోకి వచ్చాక కొన్ని నెలల క్రితం రాజీనామా చేశారు), ప్రస్తుత వైస్‌ చైర్మన్‌, ఇన్‌చార్జి చైర్మన్‌ రాందాస్‌, డైరెక్టర్లు అగ్గు లింగయ్య, కిశోర్‌ చంద్ర, శ్రీనివాస్‌, గంగాధర్‌, మన్నె పోశెట్టి, హన్మంత్‌ రావు, శ్యామ్‌, రాధ, విట్టబాయి, గంగారాం, సాయవ్వలకు నోటీసులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు నిర్ధారణ అయినందున పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో సంజాయిషీ ఇవ్వాలని 15 రోజులు గడువు ఇచ్చారు. అదేవిధంగా నిధుల రికవరీ కోసం సర్‌చార్జ్‌ నోటీసులు ఇచ్చారు.

కోటగిరి మండలం ఎత్తొండ సహకార సంఘంలో అవినీతి, అక్రమాలను అధికారులు నిర్ధారించారు. ఈ సంఘం రైస్‌ మిల్లులకు 29 వేల క్వింటాళ్ల ధాన్యం ఇవ్వగా తిరిగి సీఎంఆర్‌ ఇవ్వలేదు. దీని వెనుక భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు వెళ్లగా అధికారులు విచారణ చేపట్టారు. సీఈవోతో పాటు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేసేందుకు సహకార శాఖ చర్యలకు దిగింది.

ఎత్తొండ సొసైటీలో రూ.8.80 కోట్ల

అక్రమాల నిర్ధారణ

ఆరుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌

పాలకవర్గాన్ని రద్దు చేసేందుకు మాజీ చైర్మన్‌, ప్రస్తుత డైరక్టర్లకు నోటీసులిచ్చిన అధికారులు

అనుమానాలకు తావిస్తున్న డీసీవో

వైఖరి.. వివరణ ఇచ్చేందుకు నిరాకరణ

No comments yet. Be the first to comment!
Add a comment
నిగ్గుతేలిన అక్రమం1
1/1

నిగ్గుతేలిన అక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement