● పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
● ఫిబ్రవరి 3న నోటిఫికేషన్, 27న పోలింగ్, మార్చి 3న ఫలితాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పదవీ కాలపరిమితి వచ్చే మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే ఫిబ్రవరి 3న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 10 చివరి తేదీ. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 13. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేస్తారు. మార్చి 8న ఈ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి రానుందని ఈసీ పేర్కొంది. దీంతో ప్రజాప్రతినిధుల అధికారిక కార్యక్రమాలకు బ్రేక్ పడింది. అప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు షెడ్యూల్లో ఉన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మార్చి రెండోవారానికి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారపర్వం ఊపందుకోనుంది. ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది ఈ మూడునాలుగు రోజుల్లో తేలనుంది. బీఆర్ఎస్ తన అభ్యర్థులను నిలబెడుతుందా లేదా అనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment