గర్భస్రావ మందులతో యువతి మృతి
ఖలీల్‌వాడి: గర్భస్రావం మాత్రలు రిఫర్ చేసి ఓ యువతి మరణానికి కారణమైన పీఎంపీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏసీపీ బుధవారం వెల్లడించారు. మాక్లూర్ మండలానికి చెందిన యువతి, మెండోరా మండలం సావెల్‌కు చెందిన యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కారణంగా యువతి గర్భం (2 నుంచి 3 నెలలు) దాల్చడంతో యువకుడు తన గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్న ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన పీఎంపీ హరికృష్ణచారిని ఈనెల 4న సంప్రదించా డు. పీఎంపీ సూచించిన మాత్రలను యువకుడు అదే రోజు యువతికి ఇవ్వగా మూడు రోజుల తరువాత ఆమెకు కడుపు నొప్పితోపాటు బ్లీడింగ్ అయ్యింది. దీంతో యువతిని ఆమె తల్లి నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. యువతికి గర్భస్రావమైందని, కిడ్నీ, లివర్‌కు ఇన్ఫెక్షన్ వచ్చిందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈనెల 10న హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో యువతి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీఎంపీని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
ఏడుగురు పీఎంపీలపై కేసులు
ఎలాంటి అర్హతలు లేకుండా నిజామాబాద్ డివిజన్లో ప్రజలకు వైద్యం చేస్తున్న ఏడుగురు పీఎంపీలపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెడికల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టి ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశామన్నారు. ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో కె.గంగాధర్(ఇందల్వాయి), డిచ్పల్లి పీఎస్‌లో ఆర్ రాజేందర్(మానస క్లినిక్), ఎం వెంకటేశ్వర్(మణికంఠ క్లినిక్, మిట్టపల్లి), దత్తాద్రి(ప్రశాంత్ క్లినిక్, డిచ్పల్లి), గోలి సందీప్(లక్ష్మినరసింహ క్లినిక్, డిచ్పల్లి), ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో ఏ మల్లేశం(చందన క్లినిక్, న్యాల్కల్ రోడ్), మోపాల్ పీఎస్‌లో విఠల్సింగ్(ఏ1), సూర మహేశ్‌కుమార్ (ఏ2)పై కేసులు నమోదైనట్లు వివరించారు.
రిఫర్ చేసిన పీఎంపీ రిమాండ్
వివరాలు వెల్లడించిన ఏసీపీ
రాజావెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment