సిడ్నీ: భారత సంతతి విద్యార్థిపై ఒక దుండగుడు 11 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు బాధితుడని శుభమ్ గార్గ్‌గా గుర్తించారు. అతను సిడ్నీలోని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నట్లు తెలిపారు. అతని తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉంటారు. శుభమ్ ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. గత నెల అక్టోబర్ 6న శుభమ్‌పై దాడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు తెలిపారు.
అలాగే నిందితుడు 23 ఏళ్ల వ్యక్తి అని, అతను ఆ రోజు శుభమ్ వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడని తెలిపారు. ఐతే శుభమ్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కత్తితో పలు చోట్ల దాడి చేసి పరారైనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత శుభమ్ ఏదోరకంగా సమీపంలోని తన ఇంటికి వెళ్లి తదనంతరం ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. పోలీసులు సదరు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
భాదితుడి తండ్రి రమణివాస్ గార్గ్ తన కొడుకుకి పొత్తి కడుపులో సుమారు 11 గంటల ఆపరేషన్ జరిగినట్లు చెప్పారు. దయచేసి తన కొడుకు చికిత్సకు సాయం అందించమని, అలాగే తాము ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా వచ్చేలా ఏర్పాటు చేయమని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మేరకు బాధితుడి చెల్లెలు కావ్య గార్గే ట్విట్టర్‌లో..."సిడ్నీలో ఉన్న తన సోదరుడు శుభమ్ గార్గ్‌పై చాలా దారుణమైన దాడి జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
అతన్ని చూసేందుకు మా కుటుంబానికి అత్యవసర వీసా ఏర్పాటు చేసి సాయం అందించండి" అని ప్రధాని నరేంద్ర మోదీని, విదేశాంగ మంత్రి జై శంకర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని అభ్యర్థిస్తూ ట్వీట్ చేశారు. అంతేగాదు తన సోదరుడికి త్వరితగతిన సర్జరీలు చేయకపోతే ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పారని వాపోయింది. ఈ మేరకు సిడ్నీలోని భారత రాయబార కార్యాలయం బాధితునికి తగిన సాయం అందిస్తోంది. అంతేగాదు ఆస్ట్రేలియా హై కమిషన్ సదరు బాధిత కుటుంబ సభ్యునికి వీసా సౌకర్యం కల్పించనుందని హై కమిషన్ ప్రతినిధి తెలిపారు
(చదవండి: మళ్లీ పేలిన తుపాకీ.. ఉత్తర కరొలినాలో కాల్పుల కలకలం)
Comments
Please login to add a commentAdd a comment