
ఆధ్యాత్మిక విలువలకు నెలవైన ప్రాచీన భారతీయ దర్శనంలోని తాత్త్విక ఆలోచనలు, తత్త్వశాస్త్ర సారం ఇతివృత్తంగా భారతీయతత్త్వ శతకం పుస్తకాన్ని రచించినట్లు శతక కవయిత్రి రాధిక మంగిపూడి చెప్పారు. రాధిక మంగిపూడి రాసిన ‘భారతీయ తత్త్వ శతకము’ పుస్తకాన్ని ‘తటవర్తి గురుకులం’ ఆస్ట్రేలియా శాఖ ప్రచురించింది. ‘సింగపూర్ తెలుగు టీవీ’ వారి సాంకేతిక సహకారంతో ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అద్వితీయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వీడియో సందేశం ద్వారా ఆశీస్సులు అందించగా.. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ సినీకవి రచయిత భువనచంద్ర, కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి గౌరవ అతిథులుగా పాల్గొని ఈ పుస్తక విశిష్టతను మెచ్చుకున్నారు.
18 రోజులలో ఈ శతకాన్ని పూర్తి చేసిన రచయిత్రి రాధికకు ఆశీస్సులు తెలియజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేసిన డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ.. "మధువచోరూఢి రాధికా మంగిపూడి" అంటూ ఆశువుగా పద్య రూపంలో ఆమెకు ఆశీస్సులు అందించారు. తొలి పుస్తక ప్రతిని విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలోని అమ్మవారి చరణాలకు అర్పించి అంతర్జాలం లోనే అందరికీ అమ్మవారి దర్శనం కల్పించారు. "తమ గురుకులం నిర్వహిస్తున్న 'కావ్య గురుదక్షిణ' కార్యక్రమ పరంపరలో భాగంగా, రాధిక ఈ శతకాన్ని తాను చదువుకున్న విజయనగరం విద్యాసంస్థలకు, చిన్ననాటి గురువులకు అంకితం చేయడం, ఆ గురువుల సమక్షంలోనే ఈ ఆవిష్కరణ గావించడం ఎంతో ప్రశంసనీయమని" 'తటవర్తి గురుకులం' అధ్యక్షులు తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు.
శతక కవయిత్రి రాధిక మంగిపూడి మాట్లాడుతూ "ఆధ్యాత్మిక విలువలకు నెలవు అయిన ప్రాచీన భారతీయ దర్శనంలోని తాత్త్విక ఆలోచనలను, తత్త్వశాస్త్ర సారాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ శతకాన్ని రచించే ప్రయత్నం చేశానని, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తన రచనను దీవించి 'ముందు మాట' రూపంలో ఆశీస్సులు అందించడం, కవిపండితులు డా. మేడసాని మోహన్ వంటి పంచసహస్రావధాని చేతుల మీదుగా తన పుస్తకం ఆవిష్కరించబడడం తన పురాకృత పుణ్యంగా, భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నానని" ఆనందం వ్యక్తం చేసి అతిథులకు, గురువులకు, నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. న్యూజిలాండ్ నుండి సంగీత భారతి పాఠశాల అధ్యక్షులు మల్లెల గోవర్ధన్ గారు, వారి విద్యార్థినులు విచ్చేసి శతకంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ సంస్థ అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్న కుమార్, అమెరికా నుండి శతకం డిజైనింగ్ చేసిన "స్వర మీడియా" సంస్థ అధ్యక్షులు యక్కలి రాజేష్, రాచకొండ శాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్త్వశాస్త్ర విభాగాధిపతి డా. వానపల్లి వెంకట్రావు, ఆస్ట్రేలియా నుండి డా. చింతలపాటి, న్యూజిలాండ్ నుండి తంగిరాల నాగలక్ష్మి, హాంగ్ కాంగ్ నుండి జయ పీసపాటి మలేషియా నుండి డాక్టర్ వెంకట ప్రతాప్, కాకినాడ నుండి డా. దీక్షితులు మరియు వివిధ దేశాల తెలుగు సాహిత్యాభిమానులు, రాధిక కుటుంబ సభ్యులు, గురువులు శ్రేయోభిలాషులు, ఈ కార్యక్రమంలో పాల్గొని రాధికకు అభినందనలు తెలియజేశారు. సింగపూర్ నుండి గుంటూరు వెంకటేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని నడిపించగా గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment