అమెరికాలో తెలుగు తేజం వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం | Varshini Nagams Bharatanatyam Debut In America California | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు తేజం వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం

Published Thu, Aug 22 2024 2:57 PM | Last Updated on Thu, Aug 22 2024 2:58 PM

Varshini Nagams Bharatanatyam Debut In America California

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో హారిస్ సెంటర్ థియేటర్లో ఆగస్టు 18, 2024 న ప్రవాసాంధ్ర వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. వర్షిణి కి 6వ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు  భరతనాట్య శిక్షణ ఇప్పించారు. గురువు హేమ సత్యనారాయణన్ శిక్షణలో తన 16వ ఏట వర్షిణి  భరతనాట్య రంగప్రవేశం  కార్యక్రమంకు ఉపక్రమించింది. ప్రాచీన నాట్య కళలకు అంతంత మాత్రంగా ప్రోత్సాహం ఉన్న ఈ రోజుల్లో, ఈ తెలుగు తేజం భరతనాట్యం  ప్రదర్శించిన తీరు ఆద్యంతం అలరించింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో వర్షిణి దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది.

ఈ సందర్భంగా వేదికపై పలువురు ఆత్మీయ అతిధులు ఫాల్సం నగర కౌన్సిలర్ శ్రీ చలంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ..  భారత సాంప్రదాయంలో భాగమైన నాట్యం వారసత్వాన్ని కొనసాగించడం యువతకు అత్యంత అవసరమని చెప్పారు. రాంచో కార్డోవా నగర ప్రణాళికా కమీషనర్ సురేందర్ దేవరపల్లి నాట్యం వల్ల జీవితంతో సమతుల్యం ఏర్పడుతుందని,  భావోద్వేగాలను మరింత మెరుగ్గా సమన్వయము చేసుకునే శక్తి భరతనాట్యం వల్ల పొందవచ్చునని అన్నారు. సువిధా ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు భాస్కర్ వెంపటి మాట్లాడుతూ..  ఈ తరం యువతకు ఏదో ఒక కళలో ప్రవేశం ఉండాలనన్నారు. అది వారి వ్యక్తిత్వంలో నిర్ణయాత్మకమైన మంచి మార్పులకు కారణమవుతుందని అన్నారు.  

ఈ సందర్భంగా భరతనాట్యం రంగప్రవేశం గావించిన వర్షిణి నాగంను అభినందిస్తూ వారు ఆమెకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. కాలిఫోర్నియా  రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్ హూవర్, అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్ట సభ సభ్యుడు కెవిన్ కైలీ కార్యాలయం నుంచి వర్షిణి నాగంకు ప్రశంసా పత్రం ను ప్రదానం చేశారు. వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం సందర్భంగా అభినందిస్తూ   "సిలికానాంధ్ర సంపద" కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆనంద్ కూచిభోట్ల విడుదల అభినందనాపత్రాన్ని "సంపద" అనుసంధానకర్త శాంతి కొండా తరపున నిర్వాహకులు వర్షిణికి అందజేశారు.

ఈ  కార్యక్రమంతో స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల  ఆధ్వర్యంలో ప్రముఖ గురువు హేమ సత్యనారాయణన్ పది రంగప్రవేశాలు పూర్తిచేసినందున ఆమెను అభినందిస్తూ నిర్వాహకులు వేదికపై ఆహుతుల, ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గురువు హేమ భరతనాట్య శిక్షణా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఫాల్సం నగర కౌన్సిలర్ చలంచర్ల ఏడుకొండలు, కాలిఫోర్నియా  రాష్ట్ర స్థానిక శాసనసభ్యుడు జాష్ హూవర్, అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్ట సభ సభ్యుడు కెవిన్ కైలీ కార్యాలయం నుంచి విడుదల అయిన ప్రశంసా పత్రాలను వేదికపై ఆహుతుల హర్షధ్వానాల మధ్య ప్రదానం చేశారు.

అంతకు మునుపు స్థానిక హారిస్ సెంటర్ థియేటర్లో వైవిద్యభరితమైన భరత నాట్యాంశాలను జనరంజకంగా ప్రదర్శించి వర్షిణి ప్రేక్షకులకు కనువిందు చేసింది. స్థానిక కళాశ్రేయ నృత్య పాఠశాల  ఆధ్వర్యంలో ప్రముఖ గురువు  హేమ సత్యనారాయణన్  శిష్యురాలైన  వర్షిణి  భరతనాట్యంలో రంగప్రవేశం ప్రదర్శన చేసింది. పుష్పాంజలి, అలరిప్పు, జతిస్వరం, వర్ణం, శివస్తుతి, తిల్లానా అంశాల్లో నర్తించి భళా అనిపించింది. ఈ కార్యక్రమంకు  ఐదు వందలకు పైగా  స్థానిక శాక్రమెంటో ప్రవాసాంధ్రులు, మిత్రులు  హాజరై వర్షిణి ని అభినందించారు. విశ్రుత్ నాగం ఆలపించిన వినాయకుడి ప్రార్ధనాగీతంతో కార్యక్రమం ప్రారంభం అయింది.  

వర్షిణి  తల్లిదండ్రులు వాణి - వెంకట్ నాగం  ఆధ్యర్యంలో ఆత్మీయ అతిధులకు ఘనంగా స్వాగతం పలికారు.  అనంతరం గురుహేమ సత్యనారాయణ్‌కు సత్కారం చేశారు. వర్షిణి నాగం సోదరుడు చిరంజీవి. విశ్రుత్ నాగం ఈ సందర్భంగా వేదికపై ఏకదంతాయ వక్రతుండాయ, ఆనందామృతకర్షిణి, అన్నమయ్య కీర్తన "శ్రీమన్నారాయణ" మూడింటినీ భావయుక్తంగా ఆలపించాడు. 

విశ్రుత్ నాగం 15 ఏండ్ల వయస్సులో 2018లో విజయవాడలో కర్ణాటక సంగీతంలో రంగప్రవేశం చేసిన విషయాన్ని ఆహుతులు గుర్తుచేసుకున్నారు. ఒకే ప్రవాసాంధ్ర కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు వేర్వేరు విభాగాలలో ఆరు,ఏడు ఏళ్లల్లోనే రంగప్రవేశం చేయడం విశేషం అన్నారు. ఈ స్పూర్తితో ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు సాంప్రదాయ భారతీయ కళలను పరిచయం చేయాలని, అప్పుడే భారతీయ కళా సాంప్రదాయం దేశం దాటి విదేశాలలో కూడా విరాజిల్లుతుందని అన్నారు.  

(చదవండి: అమెరికాలో 90 అడుగుల ఎత్తయిన హనుమంతుడు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement