మైలవరంలో ఎమ్మెల్యే వసంతకు గ్రీన్ సిగ్నల్
భగ్గుమంటున్న దేవినేని ఉమా వర్గీయులు
పార్టీ ఏదైనా పోటీ పెడన నుంచే అంటున్న వేదవ్యాస్
మండలి బుద్ధ ప్రసాద్‌కు సీటు ఇవ్వాల్సిందేనంటూ అనుచరుల పట్టు
చంద్రబాబు భక్తుడినంటూ బుద్దా మరో సమావేశం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ–జనసేన టికెట్ల కేటాయింపు అంశం కాక రేపుతూనే ఉంది. జనసేన టికెట్లు కేటాయిస్తారని భావిస్తున్న అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అనుచరులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి, అధిష్టానానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఇప్పటికే పెడనలో టీడీపీకి టికెట్ కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. టీడీపీ కోవర్టుగా జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పనిచేస్తున్నారని మండిపడుతూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి.
మరోవైపు తగ్గేదే లేదని తాను పెడన నుంచే పోటీ చేస్తానని, ఏ పార్టీ అనేది తర్వాత సంగతని బూరగడ్డ వేదవ్యాస్ తేల్చి చెబుతున్నారు. అవనిగడ్డలో టీడీపీ నేతలు కార్యకర్తలు మోపిదేవిలో సమావేశం ఏర్పాటు చేసుకొని టీడీపీ, జనసేన నుంచైనా మండలి బుద్ధ ప్రసాద్‌కు సీటు కేటాయించాలని పట్టు పట్టారు. మైలవరంలో సీటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు టీడీపీ టికెట్ ఖరారు చేయడంతో.. దేవినేని ఉమా వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెనమలూరులో టీడీపీ రోజుకొకరి పేరుతో ఐవీఆర్‌ఎస్ సర్వే చేస్తూ అక్కడ కార్యకర్తలను గందరగోళంలోకి నెడుతోంది.
బుద్ద ప్రసాద్‌కు సీటు ఇవ్వాల్సిందే..
టీడీసీ–జనసేన మధ్య అవనిగడ్డ సీటు హీట్ పెంచుతోంది. మోపిదేవిలో ఆరు మండలాల టీడీపీ నాయకులు సమావేశం అయ్యారు. టీడీపీ అయినా జనసేన తరఫున అయినా టికెట్ మాత్రం మండలి బుద్ద ప్రసాద్‌కు కేటాయించాలని డిమాండ్ చేశారు. టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. జనసేన అభ్యర్థికి మాత్రం సహకరించేది లేదని కరాఖండిగా తేల్చిచెప్పారు.
రోజుకొకరి పేరుతో..
పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ సీటు కేటాయింపు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా బోడే ప్రసాద్ ఉన్నప్పటికీ రోజుకొకరి పేరుతో ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తూ కార్యకర్తలను గందరగోళంలోకి నెడుతోంది. ఇప్పటికే కొలుసు పార్థసారథి, బోడే ప్రసాద్, ఆదిశేషగిరిరావు, ఎంకే బేగ్.. తాజాగా దేవినేని ఉమా పేరుతో సైతం ఐవీఆర్‌ఎస్ సర్వేలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ అభ్యర్థిని ముందుగానే నిర్ణయించుకొని, కంటితుడుపుగా ఐవీఆర్‌ఎస్ సర్వేల పేరుతో బాబు నేతలను మభ్యపెడుతున్నట్లు పార్టీలోనే పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు.
మీడియాలో ఫోకస్ కోసం..
నియోజకవర్గంలో జన బలం లేనప్పటికీ, రోజుకో డ్రామాతో బుద్దా వెంకన్న మాత్రం రక్తికట్టిస్టున్నారు. మీడియాలో ఫోకస్ అయ్యేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గతంలో రక్తంతో గోడకు అక్షరాలు రాసి రక్తి కట్టించారు. తాజాగా విజయవాడలో బుద్దా వెంకన్న కొందరు నేతలతో సమావేశం ఏర్పాటు చేసి.. తన అభిమానులు అందరూ ఆవేదనతో ఈ సమావేశం పెట్టారని బిల్డప్ ఇచ్చారు. తాను టికెట్ ఆశించి, అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని కలరింగ్ ఇచ్చారు. తనకు చంద్రబాబు దైవ సమానులని, టీడీపీలో ఆయారాం, గయారాంలు ఉన్నారని, తాను మాత్రం చంద్రబాబుకు ఆంజనేయుడి వంటి వాడినినని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకు కేటాయించినట్లు బుద్దా వెంకన్నతోపాటు, మిగిలిన నేతలందరికీ అధిష్టానం స్పష్టం చేసినప్పటికీ.. ఈ డ్రామాలు ఎందుకోనని, టీడీపీలోని వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
వసంతకు నిరసన సెగ..
మైలవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారంటూ మీడియాలో వార్తలు రావడంతో దేవినేని ఉమా అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి మైలవరం వచ్చిన దేవినేని ఉమామహేశ్వరరావు సాక్షిగా అతని అనుచరులు డౌన్ డౌన్ వసంత అంటూ నినాదాలు చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టించి ఐదేళ్ల పాటు ఇబ్బంది పెట్టిన వ్యక్తికి మైలవరం టీడీపీ పగ్గాలు ఇవ్వడంమేమిటంటూ ఉమా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవినేని ఉమాకి సీటు ఇవ్వక పోతే సహించేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమాతో కలిసి పనిచేయడానికి సిద్ధం అని స్పష్టం చేశారు. అయినప్పటికీ గతంలో వీరి మధ్య జరిగిన వ్యక్తిగత ధూషణలు, మాటల యుద్ధాన్ని నియోజకవర్గ ప్రజలు మాత్రం గుర్తు చేసుకొంటున్నారు. టికెట్ కోసం ఉమా ఆడిన డ్రామాలు ఫెయిల్ అయ్యాయని కొంత మంది పార్టీనేతలే పేర్కొంటున్నారు. రూ.100 కోట్లు ఇచ్చి మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ రావాలని చూస్తున్నారని ఉమా చేసిన వ్యాఖ్యలు నిజం అయ్యాయని చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment