ఈవీఎం గోడౌన్‌లో కలెక్టర్ తనిఖీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సీసీ టీవీ కెమెరాలతో గోడౌన్‌కు కల్పించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్‌ను నెలనెలా తనిఖీ చేసి సమగ్ర నివేదిక అందజేస్తున్నామని తెలిపారు. డీఆర్‌ఓ ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ కో ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ చంద్ర మౌళి, ఎలక్షన్ డ్యూటీ తహసిల్దార్ గోపాల్‌రెడ్డి, తహసిల్దార్ బి.సుగుణ పాల్గొన్నారు.
విదేశీ వైద్య విద్యార్థుల నిరసన
లబ్బీపేట(విజయవాడతూర్పు): విదేశాల్లో వైద్య విద్యనభ్యశించిన విద్యార్థులు తమ సర్టి ఫికెట్లను పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఎదుట మౌన నిరసన చేప ట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో తమకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కల్పించాలని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. పక్క రాష్ట్రాలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నా, మన రాష్ట్రంలో ఎన్‌ఎంసీ నిబంధనల పేరుతో చేయడం లేదని, పీజీ ఎంట్రన్స్‌లో ర్యాంకులు వచ్చినా, సీట్లు పొందలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు పీఆర్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలతోకుటుంబాలు విచ్ఛిన్నం
భవానీపురం(విజయవాడపశ్చిమ): రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్రవాహనదారులే మృత్యువాత పడుతున్నారని, హెల్మెట్ ధరించకపోవడమే ఇందుకు కారణమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒక్కరినే బలి తీసుకోవని, మొత్తం కుటుంబాన్నే విచ్ఛిన్నం చేస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్డు భద్రతా మాసో త్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో రోడ్ సేఫ్టీపై చైతన్యం పెంపొందించేందుకు ది కృష్ణా డిస్ట్రిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగమోతు రాజా ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ జరిగింది. బెంజిసర్కిల్ సమీపంలోని అసోసియేషన్ హాల్ నుంచి బందరు రోడ్డు మీదుగా పీడబ్ల్యూడీ గ్రౌండ్ వరకు సాగిన ఈ ర్యాలీని సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హై కోర్టు ఆదేశాల మేరకు మార్చి ఒకటి నుంచి జరిమానాలు మారతాయని తెలిపారు. హెల్మెట్ ధరించక పోవడం, ఓవర్ స్పీడ్, త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి విషయాల్లో జరిమానాలు పెరగటమే కాకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించా. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు, ఏడీసీపీ ఎ.వి.ఎల్.ప్రసన్న కుమార్, రవాణా శాఖ అధికారులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment