బాబు నిజస్వరూపం బయటపడింది
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం చంద్రబాబు నైజమని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. అందుకు సూపర్ సిక్స్ హామీలు అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి, ఇప్పుడు వాటిని అమలు చేయలేమని చంద్రబాబు చేతులు ఎత్తేయడమే నిదర్శనమని పేర్కొన్నారు. హామీల అమలుపై చంద్రబాబు నిజస్వరూపం ఏడు నెలల్లోనే బయటపడిందన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అవినాష్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేయాలని చూస్తున్న చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎన్నికలకు ముందు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో రూ.80 వేల కోట్లు అప్పు చేసిందని, ఈ నిధులు ఏమయ్యాయని నిలదీశారు. కరోనా వంటి కష్టకాలంలో సైతం సంక్షేమ పథకాలు అన్నింటినీ అమలుచేసిన చరిత్ర నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని అన్నారు. లాక్‌డౌన్‌తో ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా, పథకాలను ఆపలేదని గుర్తుచేశారు. నేడు ఆదాయం లేదనే సాకుతో పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికి తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున ఇస్తామన్న డబ్బులు ఎప్పుడు వస్తాయా అని పేదలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు ప్రతి మహిళకు రూ.1500, రైతులకు ఏటా పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు, నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ ఎంత మందికి అందుతుందో వారికే తెలియదన్నారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లలో కోత వేసేందుకు తనిఖీలు జరపడం సిగ్గు చేటన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సంపద సృష్టి అంటే పథకాలు ఆపి, విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడమేనా అని ఎద్దేవా చేశారు. పేదలను మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు.
సూపర్ సిక్స్‌పై చేతులెత్తేసిన చంద్రబాబు అబద్ధాలతో ప్రజలను మోసగించిన కూటమి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
Comments
Please login to add a commentAdd a comment