పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
తిరువూరు: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ నివేశన స్థలాలను వెంటనే మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పేదలకు నివేశన స్థలాల మంజూరు కోరుతూ తిరువూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 32 లక్షల కుటుంబా లకు ఇళ్లస్థలాలు ఇచ్చారని, రాష్ట్రంలో 99 శాతం ప్రజలకు ఇళ్ల పట్టాలిచ్చారని గుర్తుచేశారు. ఇంటి నిర్మాణం చేపట్టని వారికి వెంటనే కొత్త జీఓ ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఈ ఆందోళన కొన సాగిస్తుందని, అర్జీదారులను సమీకరించి ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామన్నారు. ఆర్డీఓ మాధురికి వినతిపత్రం అందజేశారు.
హామీలను విస్మరించడం తగదు
సీఎం చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను పీఠం ఎక్కాక విస్మరించడం తగదని రామకృష్ణ అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని, రైతులకు రూ.20 వేలు, మహిళలకు నెలకు రూ.1500, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం వంటి హామీలను అమలు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, తిరువూరు సీపీఐ నాయకులు తూము కృష్ణయ్య, నాగులుమారీ, వెంకటేశ్వర్లు, సుభానీ, ఉదయ్ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment