ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్
చీపురుపల్లి: చాలాకాలం తరువాత పట్టణంలో దొంగల అలజడితో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఒకే రాత్రి సమీప ప్రాంతాల్లోని రెండు నివాసాల్లోకి చొరబడిన దుండగులు స్థానికులను భయాందోళనకు గురిచేశారు. ఒక ఇంటిలో ఎలాంటి సొత్తు లభించకపోవడంతో వెళ్లిపోయిన దుండగులు మరో ఇంట్లో 20 తులాల బంగారం, కేజీన్నర వెండి చోరీకి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు ఒక ఇంటిలో డైనింగ్ టేబుల్‌పై ఉన్న జీడిపప్పు, మరో ఇంట్లో ఫ్రిజ్‌లో ఉన్న పాయసం తీసుకుని తిన్నారు. ఇదే తరహాలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చోరీలు జరుగుతున్న నేపథ్యంలో తర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓ ముఠా వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చోరీలకు గురైన ఇళ్లను డీఎస్పీ ఏఎస్.చక్రవర్తి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హెచ్.ఉపేంద్ర, ఎస్సై ఎ.సన్యాశినాయుడు సోమవారం పరిశీలించారు. అంతేకాకుండా క్లూస్ టీమ్‌లను రప్పించి చోరీ జరిగిన ఇళ్లలో దుండగుల వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. చోరీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరణ
పట్టణంలోని ఆంజనేయపురంలో గల విజయకృష్ణ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఆప్టికల్స్ వ్యాపారి తమినాన గంగాధర్ కుటుంబంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళంలోని అత్తవారి ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు ఆదివారం రాత్రి ఇంటికి వెనుక వైపు ఉన్న కిటికీ గ్రిల్ డోర్‌ను తొలగించి ఇంటిలోకి చొరబడ్డారు. మాస్టర్ బెడ్‌రూంలో ఉన్న బీరువా తాళాలు విరగ్గొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. అనంతరం బీరువాలో ఉన్న 20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరించుకుపోయారు. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఉన్న పాయసం తీసుకుని చక్కగా తిన్నారు. సోమవారం ఉదయం అపార్ట్‌మెంట్‌లో ఉన్న నివాసితులు కిటికీ తొలగించి ఉండడాన్ని గమనించి బాధితుడు గంగాధర్‌తో బాటు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎంతో కాలంగా కష్టపడి సంపాదించుకున్న బంగారం ఒకేసారి చోరీకి గురవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగి దేముడు నివాసం వెనుక ద్వారం తాళాలు పగలగొట్టి చొరబడిన దుండగులు చిల్డ్రన్స్ బెడ్‌రూంలోకి ప్రవేశించి కబ్‌బోర్డుల్లో ఉన్న బట్టలు, వస్తువులు చిందరవందరగా పడేశారు. దేవుడి గదిలోకి వెళ్లి వస్తువులను చెల్లాచెదురు చేశారు. తరువాత హాలులో డైనింగ్ టేబుల్‌పై ఉన్న జీడిపప్పు తిన్నారు. అంతలో మాస్టర్ బెడ్‌రూంలో పడుకున్న దేముడు భార్య లేచిన శబ్దం రావడంతో దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ చోరీకి సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment