
మాట్లాడుతున్న గంగాధర్ పువ్వల, పక్కనే పార్టీ నాయకులు
అనసూయా మాఝికి టిక్కెట్టు కేటాయింపుపై రభస
కొనసాగుతున్న రాజీనామాలు
రాయగడ: రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేడీ అభ్యర్థుల తొలి రెండు జాబితాలను సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. దీనిలో భాగంగా రాయగడ శాసనసభ నుంచి అనసూయా మాఝికి టిక్కెట్టు కేటాయించడంపై పెద్ద దుమారం రేగుతోంది. ఒక వర్గం అనసూయాకు మద్దతు పలుకుతుంటే, మరోవర్గం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఒక్కసారిగా బీజేడీలో సద్దుమణిగిన విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో చాడాల్సిందే. ఇదిలాఉండగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ల కొండబాబు ఆధ్వర్యంలో గురువారం స్థానిక రింగ్ రోడ్డు సమీపంలోని బీజేడీ కార్యకర్తల కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో సీనియర్ నాయకులు, న్యాయవాది బ్రజసుందర్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ శుభ్రా పండ, పట్నాన గౌరి శంకర్, కాశీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
మహిళకు కేటాయించడం హర్షణీయం
ఏడు దశాబ్దాల తర్వాత ఒక మహిళకు ఈ స్థానం కేటాయించడం హర్షణీయమని ఎల్ల కొండబాబు అన్నారు. రాయగడ శాసనసభ నుంచి ఈసారి ఎన్నికల బరిలో ఒక మహిళకు స్థానం కల్పించడం, నవీన్ పట్నాయక్ మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని మనమంతా అభినందించాలన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి అనంతరామ్ మాఝి కుమారైన అనసూయా మాఝికి టిక్కెట్టు కేటాయింపు గొప్ప విషయమని కొనియాడారు. ఆమె విజయానికి తామంతా కృషి చేస్తామని తెలియజేశారు. టిక్కెట్టు కేటాయింపును వ్యతిరేకిస్తూ కొంతమంది రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించడం సరికాదన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈసారి రాయగడలో బీజేడీ జెండా ఎగురవేయడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.
కేటాయింపు సరికాదు
అలాగే అనసూయా మాఝికి టిక్కెట్టు ఖరారు చేయడంపై మరోవర్గం అసంతృప్తిగా ఉంది. ఈ మేరకు స్థానిక తేజస్విని హోటల్‌లో జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పువ్వల మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా బీజేడీకి సేవలందిస్తున్న తమ వర్గానికి చెందినవారిని సంప్రదించకుండా, అనసూయా మాఝికి టిక్కెట్టు ఖరారు చేయడం సరికాదన్నారు. తమ నిరసనను వ్యక్తం చేసేందుకు మున్సిపాలిటీలోని బీజేడీ కౌన్సిలర్లు, సమితి అధ్యక్షులు, సభ్యులు, సర్పంచ్‌లు సామూహికంగా రాజీనామాలు చేసి, బీజేడీ కార్యాలయానికి, అదేవిధంగా జిల్లా ఎన్నికల పరిశీలకుడు అతున్ సవ్యసాచి నాయక్‌కు పంపించడం జరిగిందన్నారు. ఒకవేళ అనసూయా మాఝి ఎన్నికల బరిలో ఉంటే విజయానికి ఎటువంటి సహాకారాన్ని అందించమని స్పష్టం చేశారు. అధిష్టానం దీనిపై ప్రతిస్పందించాలని కోరారు. సమావేశంలో రాయగడ సమితి అధ్యక్షరాలు టున్ని హుయిక, బిజు మహిళా జనతాదళ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షురాలు సుజాత పాలో, బీజేడీ పట్టణ శాఖ అధ్యక్షుడు బార్జి దశరథి నాయుడు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కొండబాబు
Comments
Please login to add a commentAdd a comment