
వస్త్ర వ్యాపారి అనుమానాస్పద మృతి
పొందూరు: మండల కేంద్రం పొందూరుకు చెందిన వస్త్ర వ్యాపారి ఉండ్రాళ్ల కిషోర్‌కుమార్(50) అనుమానాస్పదంగా మృతిచెందారు. బుధవారం ధర్మపురం గ్రామ సమీపంలోని బావిలో మృతదేహం తేలడంతో గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీయగా పొందూరుకు చెందిన వస్త్ర వ్యాపారి కిషోర్‌గా గుర్తించారు. వెంటనే భార్య అనూషకు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి ధర్మపురంలో బాకీలు వసూలు చేసేందుకు వెళ్లాడని, బావిలో పొరపాటున కాలుజారి పడిపోయి ఉంటారని అనూష ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.సత్యనారాయణ చెప్పారు. మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కిషోర్‌కుమార్‌కు భార్య అనూష, కుమారుడు శ్రీనిత్, కుమార్తె శ్రీయ ఉన్నారు. కాగా, పొందూరులో దశాబ్దాలుగా కిషోర్ కుటుంబీకులు వస్త్రవ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకులు రావడం, కస్టమర్లకు ఎక్కువగా అరువులు ఇవ్వడం, దీనికి తోడు బ్యాంకు రుణం ఉండటంతో కొన్నాళ్లుగా ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పొందూరులో సుపరిచితుడైన కిషోర్ మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి.

వస్త్ర వ్యాపారి అనుమానాస్పద మృతి