సాక్షి, నరసరావుపేట: చిత్తశుద్ధిలేని హామీలతో ప్రజలను బుట్టలో వేసుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత వంచించడంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సిద్ధహస్తులు. ఆయన ఏ మాట చెప్పినా అది రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఆచరణలోకి తీసుకురారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఎన్నికల ఏడాది కావడంతో మరోసారి ప్రజలను వంచించేందుకు కొత్త హామీలతో చంద్రబాబు కుయుక్తులు పన్నారు. ఎలాగైనా నెగ్గాలని అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట టీడీపీ బస్సు యాత్రను నిర్వహిస్తోంది. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు పల్నాడు జిల్లాలో ఈ యాత్ర సాగనుంది. గత ఎన్నికల్లో తనను తిరస్కరించిన ప్రజలను ఎలాగైనా నమ్మించడానికి చంద్రబాబు బస్సుయాత్ర ద్వారా మాయోపాయం పన్నారు. దీనిని గుర్తించిన ప్రజలు నిన్ను నమ్మం బాబూ అంటూ గళమెత్తుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో అమలు సంగతేంటని నాయకులను ప్రశ్నిస్తున్నారు.
2014 మేనిఫెస్టో కనిపించదే..!
2014 ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి సుమారు 600లకు పైచిలుకు హామీలను చంద్రబాబు ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పొందుపర్చారు. ఆనక గద్దెనెక్కాక తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలలో కనీసం పది శాతం కూడా అమలు చేయలేదు. మేనిఫెస్టోనూ టీడీపీ వెబ్‌సైట్ నుంచి తొలగించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్లీ కొత్త మేనిఫెస్టోతో చంద్రబాబు వస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
పల్నాడుకు చేసిందేమిటీ?
కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు.
► పల్నాడులో ఎంతో కీలకమైన వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ ఊసే ఎత్తలేదు. పైపెచ్చు ఎన్నికలకు ఇంకా రెండు నెలలు ఉందనగా 2019 ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే టెండర్లు పిలిచి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు.
► 2.17 లక్షల మంది రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి మాట మార్చారు.
► పల్నాడు ప్రాంతంలో పత్తి, మిర్చి పంటల ఆధారిత పరిశ్రమలను నెలకొల్పుతామని చెప్పి ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయలేదు.
► టూరిజం అభివృద్ధి హామీని అటకెక్కించారు.
► ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో యువతను దారుణంగా మోసం చేశారు.
► వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై ఏమాత్రం దృష్టిపెట్టలేదు.
► గురజాల, మాచర్ల ప్రాంతాల్లో సిమెంట్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయలేదు.
ఇప్పుడు హడావుడి
అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన పల్నాడు అభివృద్ధికి ఏమీ చేయని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే పల్నాడు రూపురేఖలు మార్చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. బస్సు యాత్ర పేరుతో ప్రజలను వంచించేందుకు యత్నిస్తున్నారు. దీంతో పల్నాడు వాసులు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment