‘రూ.లక్ష ఇస్తే పేరు తీసేస్తా’! | - | Sakshi
Sakshi News home page

‘రూ.లక్ష ఇస్తే పేరు తీసేస్తా’!

Published Wed, Nov 20 2024 1:51 AM | Last Updated on Wed, Nov 20 2024 1:51 AM

‘రూ.ల

‘రూ.లక్ష ఇస్తే పేరు తీసేస్తా’!

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : పల్నాడు జిల్లా కేంద్రంలో ఎవరి నోట విన్నా.. ఏ నలుగురు చేరినా ఒకటే చర్చ. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదని. న్యాయం కావాలి మహాప్రభో అని వెళితే.. ఎంతిస్తారు అంటూ లాఠీలు జేబులు వెతుకుతున్నాయి. ఖాకీలకు, బాధితులకు మధ్య చోటమోటా పసుపు చొక్కాలు సెటిల్‌మెంట్లు చేస్తున్నాయి. గ్రామాల్లో పందెంకోళ్లు కొక్కొరొక్కో అంటూ కత్తులు దూస్తున్నాయి. మూడు ముక్కలు ఆరు షోలు పడుతున్నాయి. రేషన్‌ బియ్యం బస్తాలు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నాయి. ఇలా రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌మెట్లు అక్రమాలకు గేట్లు తెరిచి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

న్యాయానికి సంకెళ్లు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక న్యాయానికి సంకెళ్లు పడ్డాయి. అప్పటివరకు ఉన్న పోలీసు అధికారులను నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫార్సులతో బదిలీచేశారు. పోస్టింగులలో భారీ మొత్తంలో చేతులు మారాయి. దీంతో ఽఅక్రమార్జనే ధ్యేయంగా కొంతమంది ఖాకీలు బరితెగించారు. నరసరావుపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ అక్రమాలకు కేంద్ర బిందువుగా మారింది. చిన్నాచితకా సెటిల్‌మెంట్ల నుంచి పెద్ద పెద్ద పంచాయతీల వరకు ఇక్కడే కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట చోరీ బైకులను తాకట్టు పెట్టుకున్న కేసులో సీఐ రామకృష్ణ, కానిస్టేబుల్‌ బాబులు రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేశారంటూ పమిడిపాడు గ్రామానికి చెందిన యువకుడు రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఎస్పీ కంచి శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పిలిచారు. తరువాత గురజాలకు బదిలీ చేశారు. సీఐపై శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈవ్యవహారం మరువక ముందే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఓ ఎస్‌ఐపై బదిలీ వేటు పడిందని సమాచారం.

కోడి పందేల హోరు .. పేకాట జోరు

రూరల్‌ స్టేషన్‌ పరిధిలో కోటప్పకొండ వద్ద మూడు నెలల క్రితం కోడి పందేలు, పేకాట స్థావరంపై ఎస్సీ ఆదేశాలతో దాడులు నిర్వహించి జూదరులను పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అక్రమార్కులు స్థావరాలను మార్చి ఇంకా జూదాన్ని కొనసాగిస్తున్నారని సమాచారం. కూటమి నేతల ఆధ్వర్యంలో రూరల్‌ పోలీసుల సహకారంతో సరిహద్దు గ్రామాలలో జోరుగా జూదం సాగుతోంది. దీంతో పాటు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు కొన సాగుతున్నాయి. పోలీసు సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీనిపై ఎస్పీ మందలించినా సిబ్బందిలో మార్పు రావడం లేదని తెలుస్తోంది.

రూ.లక్షల్లో అవినీతి రూరల్‌ పోలీస్టేషన్‌లో కాసులతోనే పని చోరీ కేసు మాఫీకి రూ.ఐదు లక్షల డిమాండ్‌ బాధితుడి వీడియో వైరల్‌ బియ్యం మాఫియాతో ఎస్‌ఐ కుమ్మక్కు కేసులో పేర్లు తీయాలంటే రూ.లక్ష ఇవ్వాల్సిందేనని హుకుం పోలీస్‌ సిబ్బంది సహకారంతోనే ఊరూరా పేకాట, కోడిపందేలు కొరడా ఝుళిపించిన ఉన్నతాధికారి వీఆర్‌కు కానిస్టేబుల్‌, సీఐపై శాఖాపరచర్యలు, ఎస్‌ఐపై బదిలీ వేటు! రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నప్రజాప్రతినిధి బంధువునని చెప్పుకొనే ఎస్‌ఐ

రేషన్‌ డీలర్లకు

ఎస్సై బెదిరింపులు

ఇటీవల ఇక్కుర్తిలో పట్టుబడ్డ ప్రజాపంపిణీ బియ్యంపై నరసరావుపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో సూత్రధారుల పేర్లు తొలగించేందుకు ఎస్సై రూ.లక్ష డిమాండ్‌ చేసిన ఆడియో జిల్లా ఉన్నతాధికారుల వద్దకు చేరిందట. దీంతోపాటు గతంలోనూ ఆరోపణలు రావడంతో ఆ ఎస్సైపై బదిలీ వేటు వేశారని సమాచారం. రూరల్‌ స్టేషన్‌ నుంచి మహిళా పోలీసు స్టేషన్‌కు అటాచ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఉత్తర్వులు జారీ అయి రెండురోజులైనా విధుల్లో చేరకుండా తనకున్న అధికారపార్టీ పలుకుబడితో ఎస్సై పైరవీకి దిగారు. ఎలాగైనా తిరిగి రూరల్‌ స్టేషన్‌లోనే పోస్టింగ్‌ వేయించుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధితోపాటు ఓ మంత్రితో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది.

అవినీతి సహించం

జిల్లాలో పోలీసుశాఖలో అవినీతిని ఉపేక్షించేది లేదు. తప్పు చేసినట్టు నిరూపితమైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రూరల్‌ స్టేషన్‌కి చెందిన ఎస్సైని మహిళా భద్రతపై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక విభాగంలో నియమిస్తాం. అంతే తప్ప బదిలీ అన్న ప్రచారం అవాస్తవం.

– కంచి శ్రీనివాసరావు, ఎస్పీ, పల్నాడు జిల్లా

నరసరావుపేట కేంద్రంగా రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. స్థానిక ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు రేషన్‌ బియ్యం దందాను నడుపుతున్నారు. సరుకు పేదలకు చేరకుండానే డీలర్ల వద్ద నుంచే నల్లబజారుకు తరలిస్తున్నారు. అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రేషన్‌ మాఫియాకు ఓ ఎస్సై అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా రేషన్‌ డీలర్‌ సరుకు విక్రయించేందుకు వెనకాడితే వెంటనే దాడులు చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట. తాను ప్రజాప్రతినిధి బంధువునంటూ సదరు ఎస్సై జులుం ప్రదర్శిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘రూ.లక్ష ఇస్తే పేరు తీసేస్తా’! 
1
1/3

‘రూ.లక్ష ఇస్తే పేరు తీసేస్తా’!

‘రూ.లక్ష ఇస్తే పేరు తీసేస్తా’! 
2
2/3

‘రూ.లక్ష ఇస్తే పేరు తీసేస్తా’!

‘రూ.లక్ష ఇస్తే పేరు తీసేస్తా’! 
3
3/3

‘రూ.లక్ష ఇస్తే పేరు తీసేస్తా’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement