ఆధునిక సాంకేతికతతో నేరాలకు అడ్డుకట్ట
నరసరావుపేట: పోలీసు యంత్రంగాం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే నేరాలకు అడ్డుకట్ట సాధ్యమని డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ఆయన తొలిసారిగా బుధవారం పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు స్వాగతం పలికారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మార్పులను ఐజీ వివరించారు. గౌరవ వందనం స్వీకరించిన తర్వాత కార్యాలయ ప్రాంగణంలో రెండు మొక్కలను నాటారు. నూతనంగా నిర్మించిన డాగ్ స్క్వాడ్ భవనాన్ని ప్రారంభించారు. పోలీసు శునకం అందజేసిన బొకేను స్వీకరించి అభినందించారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేలు మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్ననాటి స్నేహితుడైన సత్తెనపల్లికి చెందిన సుబ్బారావు కూడా డీజీపీని కలిసి జ్ఞాపిక అందజేశారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్‌ను సందర్శించారు. ప్రత్యేక శిబిరంలో మాట్లాడారు. ప్రస్తుతం సాధారణ నేరాల కంటే సైబర్ నేరాలు పెరిగాయన్నారు. వీటిని అరికట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. నేరాలు జరగకముందే అడ్డుకోవడానికి సాంకేతికతను అందరూ వినియోగించుకోవాలని సూచించారు. అత్యాచారాలు నిత్యకృత్యమైన వేళ చాలా బాధ్యతగా వ్యవహరించాలని సూచచించారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావులు డీజీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ చదలవాడను ప్రశ్నించగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వలన కోటప్పకొండ తిరునాళ్ల సమీక్ష రద్దుకావటంతో తామంతా డీజీపీని ఒకసారి కలిసేందుకు వచ్చామన్నారు. జిల్లా అదనపు ఎస్పీలు జేవీ సంతోష్, సీహెచ్.లక్ష్మీపతి, సత్తిరాజు, ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి, డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, బీఎల్‌ఎన్. జగదీష్, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
డీజీపీ ద్వారకా తిరుమలరావు
Comments
Please login to add a commentAdd a comment