హామీలప్పుడు అప్పులుతెలియదా?
మాచర్ల: ఎన్నికల ముందు ప్రజలకు అడ్డగోలు హామీలిచ్చి సూపర్ సిక్స్ పేరుతో అధికారాన్ని పొందిన సీఎం చంద్రబాబు తన నిజ స్వరూపాన్ని ఇప్పుడు బయటపెట్టుకున్నారని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సంపద సృష్టిస్తే తప్ప ఖర్చు పెట్టే పరిస్థితి లేదని మాయమాటలు చెప్పి ప్రజలకు మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్‌లు సిగ్గులేకుండా ఆర్థిక పరిస్థితి, గ్రోత్ రేటు బాగుంటే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం తగదన్నారు. ఒక పథకం ప్రకారం ప్రజలను సూపర్ సిక్స్ పేరుతో మోసగించారన్నారు. ఎవరూ ప్రశ్నించకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరని భావించి, అలా అడిగితే కేసులు వేస్తామని భయపెడుతూ పథకాలు అందవని చెబుతున్నారన్నారు. ఏడు నెలల్లోనే రూ. 1.19 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ‘‘మరి ఈ అప్పులతో సంపద సృష్టించలేదే.. ఉద్యోగం ఇవ్వలేదే.. ఒక్క పథకం కూడా అమలు చేయలేదే.. డబ్బులు ఎక్కడికి పోయాయి? వలంటీర్ల తొలగింపు, సచివాలయంలో పోస్టుల కుదింపు, వివిధ కార్పొరేషన్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు, వైద్యశాఖలో లక్షల మందిని తొలగించటమేనా మీ లక్ష్యం’’ అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలు, పోర్టులు, హార్బర్‌లు నిర్మిస్తే వాటిని ప్రైవేటుపరం చేస్తూ, ఇంతవరకు పైసా ఇవ్వకుండా ఎమ్మెల్యేలకు దోచిపెట్టే పనిలో ఉండటమేనా మీ లక్షణమని సీఎంను పీఆర్కే ప్రశ్నించారు. ‘‘మీ పార్టనర్ 2, 3 సినిమాలు తీస్తే వందల ఎకరాలు దోచిపెట్టారు, ఇదేనా సంపద సృష్టి?’’ అని నిలదీశారు. వాగ్దానాలు అమలు చేయలేక ఎమ్మెల్యేలకు దోచిపెట్టేందుకు ఇసుక, మట్టి, మద్యం వంటి విషయాల్లో సంపాదన మార్గం చూపుతున్నారని సీఎం తీరును విమర్శించారు. వైఎస్ జగన్ ఆనాడు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు మాయమాటలు విని మోసపోవద్దని ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. నీతి ఆయోగ్ నివేదిక పేరుతో సీఎం ఏవో మాయమాటలు చెబుతున్నారని పేర్కొన్నారు. కరోనా కాలంలోనూ వైఎస్ జగన్‌కు ఇవన్నీ గుర్తు రాలేదని, ప్రజలకు విశ్వసనీయతతో పథకాలు అందించటమే ధ్యేయంగా పనిచేశారని చెప్పారు. దానికి విరుద్ధంగా ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టి జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను చంద్రబాబు వంచిస్తున్నారని ఆరోపించారు. హామీలిచ్చినప్పుడు ఈ విషయాలు తెలియదా? అని నిలదీశారు. ఇప్పటికై నా మాయమాటలు మాని పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని చెప్పారు.
ప్రజలను మోసగించటమే మీ నైజమా? చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment