అమ్మ తొలేళ్ల సంబరానికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అమ్మ తొలేళ్ల సంబరానికి సర్వం సిద్ధం

Published Mon, Jan 27 2025 7:20 AM | Last Updated on Mon, Jan 27 2025 7:20 AM

అమ్మ

అమ్మ తొలేళ్ల సంబరానికి సర్వం సిద్ధం

నేడు తొలేళ్ల ఉత్సవం

ఘనంగా కారుగేద వాలకం

పశువులేర్లుతో గ్రామానికి చేరుకున్న సిరిమాను కర్ర

లడ్డూ ప్రసాదం సిద్దం

మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల ముద్దుబిడ్డ శంబర పోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం సోమవారం జరగనుంది. జాతరకు ఇతర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. జాతరకొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌, ఎస్పీ మాధవరెడ్డి, అడిషనల్‌ ఎస్పీ దిలీప్‌కిరణ్‌, సబ్‌కలెక్టర్‌ అశుతోష్‌శ్రీవాస్తవ్‌, ఈఓ వి.వి.సూర్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లు చేశారు.

ఘనంగా కారుగేద వాలకం

శంబర గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామస్తులు ఘనంగా కారుగేద వాలకం నిర్వహించారు. గ్రామానికి చెందిన చెల్లూరి రాములు ఉదయం నుంచి ఉపవాసం ఆచరించి, వరిగడ్డితో శరీరమంతా కప్పుకొని, యాదవవీధికి చేరుకున్న అమ్మవారి ఘటాలకు నమస్కరించారు. సీ్త్ర వేషధారణలో ఓ వ్యక్తి వచ్చి రాములును అమ్మవారి ఘటాల నుంచి తీసుకువెళ్లడం ఆనవాయితీ.

చురుగ్గా పారిశుద్ధ్య పనులు

గ్రామంలోని అన్ని వీధుల్లో ఆదివారం పంచాయతీ కార్యదర్శి గణేష్‌ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేశారు. పలు మున్సిపాల్టీల నుంచి ఆదివారం 60మంది చేరుకోగా, మరో 50మంది వరకు సోమవారం చేరుకోనున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

700 మందితో పోలీస్‌ బందోబస్తు

జాతరలో 700మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 41సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీస్‌ ఉన్నతాధికారులు కంట్రోల్‌రూమ్‌ నుంచి జాతర పర్యవేక్షించనున్నారు. జాతరలో ఎస్పీ మాధవరెడ్డి, అడిషనల్‌ ఎస్పీ దిలీప్‌కిరణ్‌, ఏఎస్పీ, డీఎస్సీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పీసీలు, రోప్‌ పార్టీ, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, హోంగార్డులు బందోబస్తు నిర్వహించనున్నారు. జాతరకొచ్చే భక్తుల అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా రోడ్డుమ్యాప్‌ను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చిన భక్తులు 100 నంబర్‌కు ఫోన్‌ చేస్తే, రూట్‌ పెట్రోలింగ్‌ పార్టీ చేరుకొని, ట్రాఫిక్‌ను నియంత్రించనున్నారు.

30వేల లడ్డూ ప్రసాదం సిద్ధం

శంబర పోలమాంబ అమ్మవారి జాతర 10 వారాల పాటు జరగనుంది. తొలి జాతరకు వచ్చే భక్తులకు 30వేల లడ్డూ ప్రసాదం, అవసరమైన మేరకు పులిహోర ప్రసాదాన్ని తయారుచేయించారు. ఉచితం, 20, 100 రూపాయిల టిక్కెట్లు ద్వారా అమ్మవారిని దర్శించుకునే భక్తులకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతరలో దేవదాయ శాఖ సిబ్బంది 60మంది వరకు విధులు నిర్వహించనున్నారు. భక్తుల కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు, దుస్తులు మార్పిడి గదులు నిర్మించారు. క్యూలైన్లు వద్ద చిన్నారులుకు పాలు అందించనున్నారు. మంచినీరు అందుబాటులో ఉంచారు.

ఐదు చోట్ల పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు

శంబర గ్రామానికి చేరుకునే వాహనదారులకు ఐదు చోట్ల పార్కింగ్‌ ప్రదేశాలను కేటాయించారు. మక్కువ నుంచి కవిరిపల్లి గ్రామం మీదుగా శంబర గ్రామానికి కేవలం ద్విచక్రవాహనాలు, ఆర్టీసీ బస్సులు రాకపోకలకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. మిగిలిన ఆటోలు, ఇతరత్ర వాహనాలను మక్కువ మీదుగా చెముడు గ్రామం నుంచి శంబర చేరుకోవాల్సి ఉంది. సన్యాసిరాజపురం, కవిరిపల్లి, తోటవలస గ్రామాలలో ముత్యాలమ్మ పండగ జరగనున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు బంధువులు చేరుకోవాలంటే పోలీసులు అనుమతితో వెళ్లనున్నారు. కవిరిపల్లి మీదుగా శంబర చేరుకున్న వాహనదారులకు శంబర పీహెచ్‌సీ పక్కన, చెముడు మీదుగా చేరుకున్న వాహనాలకు గోముఖీ నది వద్ద, మామిడిపల్లి మీదుగా వచ్చే వాహనాలు వీఆర్‌ఎస్‌ ప్రాజెక్ట్‌ వద్ద, మావుడి నుంచి చేరుకునే వాహనాలు హస్టల్‌ వద్ద, ఎస్‌.పెద్దవలస మీదుగా వచ్చే వాహనాలకు గ్రామ శివారులో స్థలాలను కేటాయించారు.

గ్రామానికి చేరుకున్న సిరిమాను కర్ర

శంబర పోలమాంబ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కార్యక్రమానికి అవసరమైన సిరిమాను, గుజ్జుమాను కర్రలను ఆదివారం రైతులు పశువులేర్లుతో గ్రామానికి తీసుకువచ్చారు. సాలూరు మండలం కందులుపదం గ్రామానికి చెందిన రైతులు తీళ్ల అచ్యుతరావు, సిద్ధయ్య పొలంలో సిరిమాను కర్రను గుర్తించారు. సుమారు 35 అడుగుల పొడవు సిరిమాను కర్రను తీసుకువచ్చారు.

అమ్మవారి ఘటాలకు భక్తుల పూజలు

చదురుగుడిలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం 3.30గంటల సమయంలో చదురుగుడి నుంచి అమ్మవారి ఘటాలు గ్రామంలోకి తిరువీధికి బయల్దేరగా, భక్తులు అమ్మవారి ఘటాలకు, పాలధారకు పూజలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అమ్మ తొలేళ్ల సంబరానికి సర్వం సిద్ధం 1
1/1

అమ్మ తొలేళ్ల సంబరానికి సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement