ఊరిబడి... ఇక ఉండదు..!
● పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేసిన కూటమి ప్రభుత్వం
● కొత్త నిబంధనలతో విద్యారంగం నిర్వీర్యం
● పార్వతీపురం మన్యం జిల్లాలో 226 ప్రాథమిక పాఠశాలలకు మంగళం
● ఇప్పటికే 151 ప్రాథమికోన్నత
పాఠశాలల ఎత్తివేతకు సన్నాహాలు
● విద్యావిధానంపై దుమ్మెత్తిపోస్తున్న విద్యార్థులు, మేధావులు,
తల్లిదండ్రులు
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వీరఘట్టం మండలం బొడ్లపాడు ప్రాథమిక పాఠశాల. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 1–5వ తరగతి వరకు 28 మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే ఏడాది వీరిలో 5వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు 6వ తరగతి కోసం హైస్కూల్‌కు వెళ్లిపోతారు. ఈ పాఠశాలలో వచ్చే ఏడాదికి 23 మంది విద్యార్థులే ఉంటారు. వీరిలో 1వ తరగతి తప్ప 2వ తరగతి విద్యార్థులు ముగ్గురు, 3, 4, 5 తరగతుల విద్యార్థులు 20 మంది ఉంటారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యావిధానం ప్రకారం పాఠశాలలో ఉన్న 3, 4, 5 తరగతులకు చెందిన 20 మందిని ఇదే పంచాయతీ పరిధిలో 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న రేగులపాడు పాఠశాలలో విలీనం చేస్తారు. అప్పుడు బొడ్డ పాడులో ప్రస్తుతం 1వ తరగతి చదువుతున్న విద్యార్థులు ముగ్గురు రెండో తరగతికి వస్తారు. అంగన్‌వాడీలో చదువుతున్న పిల్లలను బట్టి చూస్తే 1వ తరగతిలో కొత్తగా ఒక్క విద్యార్థే చేరే అవకాశం ఉంది. అంటే జాన్–12న ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో బొడ్లపాడు పాఠశాలలో నలుగురు విద్యార్థులే ఉంటారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానం వల్ల ప్రాథమిక పాఠశాల మనుగడ ప్రశార్థకమే.
వీరఘట్టం మండలంలోని విక్రమపురం ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను 3 కి.మీ దూరంలో ఉన్న నడుకూరు పాఠశాలలో విలీనం చేయనున్నారు. పాలమెట్ట స్కూల్‌ను తూడి స్కూల్‌లో, కంబరవలస పాఠశాలను కంబరలో విలీనం చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఇలా వీరఘట్టం మండలంలోని 40 ప్రాథమిక పాఠశాలల్లో 11 పాఠశాలలను సమీపం పాఠశాలలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది.
పాలకొండ మండలంలో 41 ప్రైమరీ స్కూల్స్‌లో 6 స్కూల్స్‌ను పక్క పాఠశాలలో విలీనం చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉన్న 1053 ప్రాథమిక పాఠశాలల్లో 226 పాఠశాలలను ఎత్తివేసేందుకు జిల్లా కార్యాలయాల్లో మండల విద్యాశాఖ అధికారులు గత వారం రోజులుగా చర్చిస్తున్నారు. ఈ చర్చలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. మరిన్ని ప్రాథమిక పాఠశాలలను తగ్గించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment