
కమిషనరేట్‌లో ప్రక్షాళన
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పాలనాపరమైన వ్యవస్థలపై ప్ర త్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే సుదీర్ఘకాలంగా ఒకేచోట.. పోలీస్ కమిషరేట్‌లో పనిచేస్తున్న పోలీసు ఉద్యోగులు, సిబ్బందికి స్థానచలనం కల్పించడం ప్రారంభించారు. కిందిస్థాయి సిబ్బంది మొదలుకుని ఉన్నతస్థాయి వరకు తన మార్కు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా వివా దాల్లో తలదూర్చడం, విధుల్లో నిర్లక్ష్యం చేయడం తదితర కారణాలతో మరికొందరిపై కూడా బదిలీవేటు వేయొచ్చనే ప్రచారం జరుగుతోంది.
కమిషనరేట్ నుంచి..
పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం మొద లు.. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని ఠాణాల్లో ప నిచేస్తున్న పోలీసు ఉద్యోగులను బదిలీ సీపీ చేశారు. తొలుత టాస్క్‌ఫోర్స్ టీంలను రద్దు చేశారు. ఆ తర్వాత కీలకమైన మోటారు ట్రాన్స్‌ఫోర్స్ అధికారులకూ స్థానచలనం కలిగించారు.
ఎంటీవో విభాగంలో తప్పని బదిలీలు
కమిషరేట్ పరిధిలోని అతికీలకమైన మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం ప్రక్షాళనపై పోలీస్ కమిషనర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో రెండు జిల్లాలకు ఒకేఅధికారి ఉండగా, ప్రస్తుతం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఇద్దరు ఎంటీవోలను నియమించారు. ఈ నేపథ్యంలోనే కమిషరేట్‌లో మరికొన్ని బదిలీలు కూడా ఉండవచ్చని అంటున్నారు. వివాదస్పదంగా ఉన్న అధికారులపైనా అంబర్ కిశోర్‌ఝా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
27మంది సిబ్బందికి స్థానచలనం..
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో 27 మంది పోలీసు సిబ్బందికి సీపీ స్థానచలనం కలిగించారు. మరికొందరిని కూడా బదిలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేచోట ఎక్కువకాలం పనిచేస్తున్న సిబ్బంది ఇందులో ఉన్నారు. అలాగే కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో కూడా ఒకేచోట ఎక్కువకాలంగా పనిచేస్తున్న వారినీ ఇతర ప్రాంతాలకు ఇటీవలే బదిలీ చేశారు.
మరో కీలకవిభాగంపై దృష్టి
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని మరో కీలకవిభాగంపై పోలీస్‌బాస్ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఈవిభాగంలో ఇష్టారాజ్యంగా వ్యవహారాలు నిర్వహించినట్లుగా పోలీసు సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో ఈవిభాగంలో కూడా త్వరలో ప్రక్షాళన తప్పకపోవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది.
లాంగ్‌స్టాండింగ్ పోలీసులకు స్థానచలనం
ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకూ బదిలీలు
టాస్క్‌ఫోర్స్ బృందాల రద్దు.. ఎంటీవోపై ప్రత్యేక దృష్టి
పాలనపై పట్టుబిగిస్తున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా