ఓట్ల కౌంటింగ్‌ తేదీని మార్చండి..  | 6 member delegation in Delhi to request ECI over counting date change | Sakshi
Sakshi News home page

Mizoram Elections 2023: ఓట్ల కౌంటింగ్‌ తేదీని మార్చండి.. 

Published Thu, Nov 23 2023 10:06 PM | Last Updated on Thu, Nov 23 2023 10:06 PM

6 member delegation in Delhi to request ECI over counting date change - Sakshi

ఈశాన్య రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలంటూ ఆ రాష్ట్ర పౌర సంఘాలు విజ్ఞప్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఆ రాష్ట్ర పౌర సమాజం, విద్యార్థి సంఘాల గొడుగు సంస్థ అయిన మిజోరం ఎన్‌జీవో కోఆర్డినేషన్ కమిటీ నుంచి ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. అయితే వీరికి ఎన్నికల కమిషన్‌ అపాయింట్మెంట్‌ లభించలేదని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

ఆదివారం కావడంతోనే..
మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న  తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తోపాటుగా మిజోరాంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.  క్రైస్తవ మెజారిటీ రాష్ట్రమైన మిజోరాంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, పౌర సమాజం, ఇతర సంఘాలు కౌంటింగ్‌ తేదీని మార్చాలని ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కోరాయి. డిసెంబర్ 3 ఆదివారం కావడంతో చర్చి కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగుతాయని విజ్ఞప్తులు చేశాయి. 

అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వారి డిమాండ్లను అంగీకరించలేదు.  పోలింగ్‌ తేదీ లాగా కౌంటింగ్‌ తేదీ ప్రభావం సాధారణ ప్రజలపై ఉండదని,  ఆ రోజున వారు నచ్చినట్లుగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనవచ్చిని ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేసింది.

తమకు ఎన్నికల కమిషన్‌తో ముందస్తు అపాయింట్‌మెంట్ లేనప్పటికీ ఢిల్లీకి చేరుకుని ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులను కలవడానికి ప్రయత్నించవచ్చన్న సూచన మేరకు ఇక్కడికి వచ్చినట్లు సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్సావ్‌మ్లియానా పీటీఐకి చెప్పారు. సీవైఎంఏ అనేది ఎన్‌జీవోసీసీలో ఒక భాగం కాగా, ఢిల్లీకి వచ్చిన ఆరుగురు ప్రతినిధుల్లో మల్సావ్‌మ్లియానా ఒకరు.

తమ డిమాండ్లను ఈసీ అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తాము ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి ప్రయత్నిస్తామని, కౌంటింగ్ తేదీని రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థిస్తామని  సీవైఎంఏ  ప్రెసిడెంట్ లాల్‌మచువానా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement