లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడానికి వీల్లేదు. వారు ఖర్చు చేసే ప్రతి పైసాకు ఎన్నికల కమిషన్‌కు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ప్రచార సమయంలో తమ మద్దతుదారులకు ఇప్పించే ఛాయ్, సమోసాలకు ఖర్చుపెట్టిన డబ్బుకు కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగించే 200కు పైగా వస్తువుల సవరించిన ధరల జాబితాను ఇటీవలి నోటిఫికేషన్‌లో ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు ఖర్చు పరిమితిని మించకుండా చూసుకోవడానికి వీటిని ఎన్నికల ప్రకటిచింది. ఈసీకి సమర్పించే ఖర్చుల వివరాల్లో ఆయా వస్తువులు, ఆహార పదార్థాలకు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువగా చూపించేందుకు వీలుండదు.
పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఎలక్షన్ కమిషన్ ఈ సారి రూ.95 లక్షలకు పెంచింది. ఇది 2019 ఎన్నికల సమయంలో రూ. 70 లక్షలు ఉండేది. ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వినియోగించే వస్తువులు, సేవల ధరలను కూడా ఈసీ స్వల్పంగా పెంచింది. ధరల జాబితాను ఉపయోగించి అభ్యర్థులు చేసే ఖర్చులను జిల్లా ఎన్నికల అధికారి మూల్యాంకనం చేస్తారు.
చెన్నై జిల్లా ఎన్నికల అధికారి జె.రాధాకృష్ణన్ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. టీ ధరను రూ.10 నుంచి రూ.15కి, కాఫీ ధరను రూ.15 నుంచి రూ.20కి పెంచారు. అయితే చికెన్ బిర్యానీ ప్యాకెట్ ధరను మాత్రం రూ. 2019తో పోలిస్తే రూ.180 నుంచి రూ.150కు తగ్గించారు. మరోవైపు మటన్ బిర్యానీ ప్యాకెట్ ధరలో మార్పు లేదు. అది రూ. 200గా ఉంది. టీషర్టులు, చీరల ధరలు కూడా పెంచలేదు.
ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనే వారికి అందించే ఆహారం, వాహనాలు, ప్రచార కార్యాలయాలు, సమావేశాల కోసం అద్దెకు తీసుకున్న ఇతర ఫర్నిచర్, వేదిక అలంకరణ ఖర్చులు, కూలీల ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యానర్లు, పోస్టర్లు, కుర్చీలు వంటి వస్తువులతో సహా అనేక అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. జెండాలు, బాణాసంచా, పోస్టర్లు, దండలు, సాంస్కృతిక నృత్యాలతో సహా రాజకీయ నేతలకు స్వాగతం పలికేందుకు అయ్యే ఖర్చులు కూడా అభ్యర్థి ఖర్చుల్లోనే చేరుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment