మదనపల్లె: పోలీసులను రెచ్చగొట్టి, కాల్పులకు ప్రేరేపించి, ఆ కాల్పుల్లో పదుల సంఖ్యలో అమాయక టీడీపీ కార్యకర్తలు చనిపోతే వారి శవాలతో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పరేడ్ నిర్వహించి రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహంతోనే అంగళ్లు, పుంగనూరుల్లో టీడీపీ నాయకులు విధ్వంసకాండకు పాల్పడ్డారని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. అంగళ్లు, పుంగనూరు విధ్వంసకాండలో అరెస్టయిన 120 మంది టీడీపీ నాయకుల బెయిల్ పిటిషన్లపై గురువారం మదనపల్లె రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి, ఏపీపీలు రామకృష్ణ, జనార్ధనరెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. పుంగనూరు, అంగళ్లులో విధ్వంసాన్ని, టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్టు ఆయకట్టు రైతులపైకి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియోలను న్యాయమూర్తి అబ్రహాంకు ఏఏజీ సుధాకర్‌రెడ్డి చూపించారు. ఆగస్టు 4న చంద్రబాబు ములకలచెరువు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్‌ను పరిశీలించి అంగళ్లు, మదనపల్లె, పుంగనూరు బైపాస్ మీదుగా చిత్తూరు వెళ్లేందుకు డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నారన్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గం పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు ఎన్జీటీ కోర్టులో స్టే తేవడంపై నిరసన తెలిపేందుకు ఆయకట్టు రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి అంగళ్లుకు రాగా, వారిని చూసిన చంద్రబాబు ‘కొట్టండి.. చంపండంటూ’ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టినందుకే అల్లర్లు చెలరేగాయన్నారు. అంగళ్లులో మొదలైన విధ్వంసకాండ 30 కిలోమీటర్ల మేర కొనసాగి పుంగనూరులో పరాకాష్టకు చేరిందన్నారు. పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి 5,000 మంది కార్యకర్తలతో చంద్రబాబును పట్టణంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పారు.
బాబు పర్యటనలో పట్టణం లేదని, బైపాస్ వరకే ఉందని పోలీసులు అడ్డుకొన్నారని, వెంటనే టీడీపీ శ్రేణులు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విచక్షణారహితంగా దాడిచేసి, విధ్వంసం సృష్టించారన్నారు. ఈ ఘటనలో 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని, మహిళా ఎస్‌ఐ కాలు విరిగిందని, ఓ కానిస్టేబుల్ కన్ను కోల్పోయారని తెలిపారు. ఎస్పీలు రిశాంత్‌రెడ్డి, గంగాధరరావు సంయమనం పాటించి కాల్పులు జరపకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.
కాల్పులు జరిగి కార్యకర్తలు చనిపోతే శవ రాజకీయాలు చేసి, శాంతిభద్రతలు క్షీణించాయంటూ రాష్ట్రపతి పాలన కోరాలన్నదే టీడీపీ నేతల వ్యూహమని చెప్పారు. ఇందులో ప్రైవేటు వ్యక్తులు సాక్షులుగా ఉన్నారని, అరెస్ట్ చేయాల్సిన వారు ఇంకా పరారీలో ఉన్న కారణంగా బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని, సమాజంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పారు. పోలీసులపై దాడులు చేసి చట్టంలోని సెక్షన్ 438 ద్వారా బెయిల్ తీసుకోవచ్చనే ధైర్యం నిందితులకు ఉందన్నారు.
బెయిల్ మంజూరు చేస్తే చట్టం ఏమీ చేయలేదనే సందేశం సమాజంలోకి వెళ్లి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం తరపున కాకుండా ఓ సాధారణ పౌరుడిగా సమాజశ్రేయస్సు, భద్రతను కాంక్షించి బెయిల్ నిరాకరించాల్సిందిగా కోరామన్నారు. నిందితుల తరపున హైకోర్టు న్యాయవాదులు హరిబాబు, కోటేశ్వరరావు తదితరులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.
బాబు అధికారంలోకి రావాలనే ఈ కుట్రంతా
అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఏఏజీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి అధికారంలోకి రావాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి సమాజంలో అల్లకల్లోలం సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, క్షీణించాయని ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు.
ప్రజలను భయò³ట్టి అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. చట్టం ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి సమాజాన్ని నెట్టవద్దని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ కేశప్ప, సీఐలు సత్యనారాయణ, శివాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment