సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై సీఐడీ 2022 లో నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌లో తదుపరి విచారణ ఈ నెల 26కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సురేష్‌రెడ్డి విచారణ జరిపారు. చంద్రబాబు తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి స్పందిస్తూ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈరోజే (గురువారం) విచారణ జరపనుందని, అందువల్ల ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోర్టును కోరారు. సీఐడీ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యడవల్లి నాగ వివేకానంద స్పందిస్తూ.. పీటీ వారెంట్‌తో పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగించాలంటూ కూడా పిటిషన్ వేశామని చెప్పారు.
ఏసీబీ కోర్టులో ఉన్న వ్యాజ్యాల విచారణకు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ అడ్డంకి కాదని ఉత్తర్వుల్లో నమోదు చేయాలని కోర్టును కోరారు. విచారణను వాయిదా వేయడానికి అభ్యంతరం లేదన్నారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుంటూ.. సోమవారం తాను ఇతర కేసుల్లో వాదనలు వినిపించాల్సి ఉన్నందువల్ల విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. ఇరుపక్షాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మధ్యే మార్గంగా విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఆరోజు మద్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతానని చెప్పారు. ఈ బెయిల్ పిటిషన్ ప్రభావానికి లోను కాకుండా ఏసీబీ కోర్టు తన ముందు వ్యాజ్యాల్లో విచారణను కొనసాగించవచ్చునని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment