![AAP MP Alleges BJP Offer Him Money And Cabinet Post - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/6/aap%20punjab%20mp.jpg.webp?itok=xqHovAga)
బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన పంజాబ్ ఆప్ ఎంపీ భగవంత్ మాన్
చండీగఢ్: పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్ చీఫ్, ఎంపీ భగవంత్ మాన్ కాషాయ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తనకు డబ్బు ఆశచూపారని, కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పిస్తామని ప్రలోభ పెట్టారని మాన్ ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపించారు.
‘బీజేపీ సీనియర్ నేత ఒకరు నాలుగు రోజుల క్రితం నాతో మాట్లాడారు. బీజేపీలో చేరేందుకు మీరు ఏం తీసుకుంటారు?. మీకు డబ్బేమైనా కావాలా? మా పార్టీలోకి వస్తే కేంద్ర కేబినెట్‌లో కావల్సిన పోస్టు ఇస్తాం’ అని ఆశ చూపారన్నారు. సదరు బీజేపీ నేత పేరును సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానన్నారు. పంజాబ్‌లోని ఆప్ ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ నేతలు గాలం వేస్తున్నారన్నారు.
పంజాబ్‌లో ఆప్ ఏకైక ఎంపీ అయినందున పార్టీ మారితే తనకు ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వర్తించదని చెప్పారు. అయినప్పటికీ, తను ఎవరికీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment