ఆప్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పాతవారికి దక్కని టిక్కెట్లు
ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లాన్‌ల స్థానాల మార్పు
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులపై కరుణ చూపిన పార్టీ
అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయ సేకరణ
కౌన్సిలర్లకు ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది(2025) ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీకి వ్యూహప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వెలువరించిన అభ్యర్థుల రెండో జాబితాలో పార్టీ వ్యూహం వెల్లడయ్యింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి
ఆప్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పాతవారికి తిరిగి టిక్కెట్లు దక్కలేదు. పార్టీ ఇప్పటి వరకు 31 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఆయా స్థానాల్లోని ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు కేటాయించలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లాన్‌ల స్థానాలు కూడా మారాయి. ఇదే సమయంలో అంత్యంత ఆసక్తికరంగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తమ అభ్యర్థులు, కౌన్సిలర్లపై ఎమ్మెల్యేలకు మించిన రీతిలో ఆప్ వారిపై నమ్మకం వ్యక్తం చేసింది.
విమర్శలకు చెక్ పెడుతూ..
పక్కా ప్రణాళికతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలపై ఓటర్లకు ఉన్న ఆగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కొత్తవారికి అవకాశం ఇచ్చిన కారణంగా ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను విమర్శించే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఎత్తుగడను ఆప్ ప్లే చేసింది. ఈసారి ఎన్నికలు అంత సులువు కాదని వ్యూహకర్తలు కూడా భావిస్తున్నారట. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం తేలిందంటున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ
ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఆప్ తమ అభ్యర్థుల ఎంపికలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిందని సమాచారం. అభ్యర్థులను ఖరారు చేసిన చాలా స్థానాల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. గత ఎన్నికల్లో ఆప్ టిక్కెట్‌పై మూడు స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఆప్ ఈ స్థానాల నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. మిగిలిన 20 సీట్లలో రాఖీ బిర్లాన్, మనీష్ సిసోడియాల సీట్లు కూడా మారాయి. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల టిక్కెట్లు మార్చి కొత్త అభ్యర్థులను పార్టీ రంగంలోకి దించింది. వీరిలో 90 శాతం మంది ఆప్ కౌన్సిలర్లు కావడం విశేషం. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రజాదరణ పొందిన కౌన్సిలర్లకు రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆప్ అవకాశం కల్పించింది.
ఈ కౌన్సిలర్లకు ఆప్ టిక్కెట్లు
నరేలా నుంచి దినేష్ భరద్వాజ్, ఆదర్శ్ నగర్ నుంచి ముఖేష్ గోయల్, జనక్‌పురి నుంచి ప్రవీణ్ కుమార్, డియోలి నుంచి ప్రేమ్ కుమార్ చౌహాన్, చాందినీ చౌక్ నుంచి పునర్దీప్ సింగ్ సాహ్ని, త్రిలోక్‌పురి నుంచి అంజనా పర్చా (మాజీ కౌన్సిలర్)కు ఆప్ టిక్కెట్లు కేటాయించింది. ఇదేవిధంగా త2020లో ఓడిపోయిన అభ్యర్థులు మళ్లీ టిక్కెట్లు కేటాయించింది. ఈ జాబితాలో రోహిణి నుంచి ప్రదీప్ మిట్టల్, గాంధీ నగర్ నుంచి నవీన్ చౌదరి ఉన్నారు. ఆ పార్టీ ఇప్పటి వరకు 31 మంది అభ్యర్థులను ప్రకటించింది.
ఇది కూడా చదవండి: కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment