నరసరావుపేట టికెట్ చదలవాడకు ఇవ్వలేదని ఏఎంసీ మాజీ చైర్మన్ ఆత్మహత్యాయత్నం
చంద్రబాబు మాట తప్పారని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం మండిపాటు
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రకటన
విశాఖ జనసేనలో వర్గపోరు.. మేకపోతుతో వినూత్న నిరసన
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్/డోన్/కాళ్ల/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/వెంకటగిరి రూరల్ (తిరుపతి జిల్లా)/శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా)/దేవరపల్లి: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. సీనియర్ నాయకులు తమకు టికెట్ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను హెచ్చరిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవిందబాబును ప్రకటించడానికి టీడీపీ అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోందని నిరసిస్తూ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి విలేకరుల సమక్షంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
నరసరావుపేట మండలం పాలపాడులోని తన స్వగ్రహంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మధ్యే పార్టీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అరవిందబాబుకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇంకా పార్టీలో చేరని జంగా కృష్ణమూర్తి, మరో ఎన్‌ఆర్‌ఐకి టికెట్ ఇప్పించేందుకు ఆయన పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు.
బీసీ ద్రోహి శ్రీకృష్ణదేవరాయలు అని మండిపడ్డారు. అనంతరం పక్కనే ఉన్న పురుగుమందు డబ్బాను అందుకుని తాగారు. కార్యకర్తలు ఆయనను నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇదంతా చదలవాడ ఆడిస్తున్న డ్రామా అని ప్రత్యర్థివర్గాలు ఆరోపిస్తున్నాయి.
కేఈ, కోట్లది చీకటి ఒప్పందం
కేఈ, కోట్ల కుటుంబాలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని తాము మాత్రమే డోన్ రాజకీయాలను శాసించాలనే విధంగా ప్రవర్తిస్తున్నాయని టీడీపీ డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మండిపడ్డారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. మూడేళ్ల క్రితం కోట్ల, కేఈ కుటుంబాలు డోన్ టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటే తాను పార్టీని బతికించానని, రెండున్నరేళ్ల క్రితమే తనను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ మోసం చేసింది : శివరామరాజు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో బుధవారం జైన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తే తనను అధిష్టానం మోసం చేసిందని విమర్శించారు.
కష్టపడిన వారికి గుర్తింపు లేదు
టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొలిగర్ల మస్తాన్‌యాదవ్ విమర్శించారు. తిరుపతిజిల్లా వెంకటగిరి పట్టణంలోని తనచారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ కోసం సేవ చేస్తే చివరకు టికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మస్తాన్ యాదవ్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మద్దిపాటిని మార్చకుంటే బరిలోకి రెబల్
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజును మార్చకుంటే పార్టీలో తిరుగుబాటు తప్పదని కార్యకర్తలు హెచ్చరించారు. బుధవారం నల్లజర్లలోని ప్రియాంక కన్వెన్షన్ హాల్‌లో మద్దిపాటి వ్యతిరేకవర్గం సమావేశమైంది. మద్దిపాటిని మార్చకుంటే రెబల్ అభ్యర్థిని బరిలో దింపుతామని అలి్టమేటం జారీ చేశారు.
బొజ్జలకు మద్దతు లేదు
బొజ్జల సుదీర్‌రెడ్డికి తాము మద్దతివ్వలేదని మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య స్పష్టం చేశారు. ఎస్సీవీ నాయుడు స్వగృహంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సు«దీర్‌రెడ్డి తమను కలిశారని, అయితే మద్దతిస్తున్నట్టు ఆయనకు తాము చెప్పలేదని పేర్కొన్నారు. తానూ చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే టికెట్ కోరతానని స్పష్టం చేశారు.
బలిచ్చే మేకపోతు మాకొద్దు
విశాఖ దక్షిణ జనసేన టికెట్ వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఇవ్వొద్దంటూ కార్పొరేటర్ సాధిక్ వర్గీయులు పట్టుబడుతున్నారు. దీంతో సాధిక్ కార్యాలయం వద్ద వంశీకృష్ణ శ్రీనివాస్, సాధిక్ వర్గీయులు బుధవారం బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులకు సిద్ధమయ్యారు. దీంతో సాధిక్, వీరమహిళలు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. ‘‘బలిచ్చే మేకపోతు మాకొద్దు’’ అంటూ ఓ మేకను తీసుకొచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment