
స్ట్రాంగ్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి పార్టీపై అసంతృప్తి గళం వినిపించేందుకు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇవాళ జరిగిన స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీకి సైతం ఆయన డుమ్మా కొట్టారు. ఇంతకాలం పార్టీనే తన తొలి ప్రాధాన్యతగా చెబుతూ వస్తున్న ఆయన.. ఇప్పుడు ఆత్మగౌరవం ముఖ్యమంటూ స్వరం మార్చడం గమనార్హం.
ఆయన అలక వెనుక సరైన కారణం తెలియనప్పటికీ.. కీలక పదవులు దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుజ్జగింపులకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఏఐసీసీ ఆదేశాలనుసారం.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సమస్యల్ని అంతర్గతంగానే.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో.. వచ్చి తనను కలవాలని సూచించినట్లు సమాచారం.
అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్తారని, అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి ని బుజ్జగిస్తారని తెలుస్తోంది. కోమటిరెడ్డి ఇంటికి వెళ్తున్న.. ఆయనతో భేటీ అవుతా అంటూ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం ఠాక్రే సైతం ప్రకటన చేశారు. అయితే కోమటిరెడ్డి స్ట్రాంగ్ లీడర్ అని, ఆయన అలగరు అని సీనియర్ నేత భట్టి చెబుతుండడం గమనార్హం.
రేవంత్‌రెడ్డి పీసీసీ నాయకత్వాన్ని విబేధిస్తూ.. పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు కోమటిరెడ్డి. అయితే కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత కలిసి పని చేయాలనే అధిష్టానం ఆదేశాలతో కలుపుగోలుగా పని చేయాలని భావించారు. ఈ తరుణంలో.. పార్టీలో చేరికలు, సీట్ల కేటాయింపు అంశం మళ్లీ కోమటిరెడ్డిని అసహనానికి లోను చేశాయి. ఈలోపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ రెండింటిలో జాబితా వెలువడడం.. ఆ రెండింటిలో తనకు పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు స్పష్టమవుతోంది.