
లక్నో: 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ చేతులు కలిపి ‘ఇండియా కూటమి’గా ఏర్పడిన విషయం విదితమే. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్, కూటమి భాగస్వామ్య పక్షల మధ్య సీట్ల పంపకం విషయంలో చిక్కులు తలెత్తాయి. కాంగ్రెస్‌తో సీట్ల పొత్తుపై అభ్యంతరాలు రావడంతో ఒక్కో పార్టీ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటిస్తున్నాయి. దీంతో అసలు ఇండియా కూటమి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.
ఈ తరుణంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లో తమ మద్దతు కావాలంటే సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్‌కు కొత్త షరతును విధించింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పోటీ చేసేందుకు 15 స్థానాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ వెల్లడించినట్లు సమాచారం.
కాగా 2019 లోక్‌సభ ఎన్నికలలోకాంగ్రెస్ మొత్తంగా 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో కేవలం రాయ్‌బరేలీలో మాత్రమే కాంగ్రెస్(సోనియా గాంధీ) గెలిచింది. అయితే అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అమేథీ, రాయ్‌బరేలీలో పోటీకి దూరంగా ఉంది.
అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పొత్తు కుదిరితే ఇతర స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయలేదని తెలిపింది. ఈ ప్రకటనపై కాంగ్రెస ఇంకా స్పందించలేదు. మరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అంతేగాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయం కూడా ఇప్పుడు హస్తం పార్టీ ఆఫర్ అంగీకరించడంపై ఆధారపడి ఉంది.
చదవండి: కర్నాటక సీఎంకు ‘సుప్రీం’లో ఊరట!
‘కాంగ్రెస్‌తో అనేకసార్లు చర్చలు జరిపాము. అనేక జాబితాలను మార్చుకున్నాము. సీట్ల పంపకం పూర్తయినప్పుడు సమాజ్ వాదీ పార్టీ వారి న్యాయ యాత్రలో పాల్గొంటుంది’ అని అఖఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.కాగా రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో సాగుతోంది. ఆదివారం ప్రయాగ్‌రాజ్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ బాబుగంజ్‌లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొనడంపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.