మరో మేనిఫెస్టో.. దసరా వేషమే! | Ambati Rambabu open letter to Chandrababu naidu | Sakshi
Sakshi News home page

మరో మేనిఫెస్టో.. దసరా వేషమే!

Published Mon, Oct 23 2023 5:17 AM | Last Updated on Mon, Oct 23 2023 5:17 AM

Ambati Rambabu open letter to Chandrababu naidu  - Sakshi

సాక్షి, అమరావతి/నగరంపాలెం: మాజీ సీఎం చంద్రబాబు అవినీతి కేసులో జైలుకెళ్లి 44 రోజులైనా పవన్‌కళ్యాణ్‌ మినహా ఎవరూ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు సానుభూతి డ్రామాలు మొదలుపెట్టారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుల్లో లాయర్లపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ‘నిజం గెలవాలి’ అంటున్న నారా భువనేశ్వరి న్యాయస్థానాల్లో సత్యం గెలవడం వల్లే చంద్రబాబు జైలులో ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. స్థాయికి మించి ఎక్కువగా మాట్లాడవద్దని లోకేశ్‌కు హితవు పలికారు.

చంద్రబాబు జైలుకెళ్లడం గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎందుకో విపరీతంగా ఆవేశపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను జైలులో కాకుండా ప్రజల గుండెల్లో ఉన్నానంటూ లేఖ రాసిన మాజీ సీఎం చంద్రబాబు ఆయన పేరు చెబితే గుర్తొచ్చే నాలుగు పథకాల పేర్లను వెల్లడించాలని సూచించారు. తన కోసం ఉవ్వెత్తున ప్రజా చైతన్యం ఎగసిపడుతోందని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలు కూడా ప్రజలే అని గుర్తించాలన్నారు.

‘మీ దుష్ట బృందంలో అందరికీ వయసు పెరిగినా జీవన సంధ్యా సమయంలో కూడా నిజాన్ని ఒప్పుకునే అంతరాత్మ మాత్రం ఏ ఒక్కరికీ లేదు’ అని చంద్రబాబుకు చురకలంటించారు. ఈమేరకు అంబటి ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడటంతోపాటు చంద్రబాబునుద్దేశించి రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. 

45 రోజుల జైలు జీవితం తర్వాతైనా నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ మీరు ఉత్తరం రాశారు. జైలు నుంచి ఈ లేఖను ఎలా బయటకు పంపారన్న టెక్నికల్‌ డీటెయిల్స్‌లోకి, 17(ఏ) ప్రొటోకాల్స్‌లోకి నేను వెళ్లటం లేదు. మీ పేరిట టీడీపీనే ఆ ఉత్తరం ఇచ్చింది కాబట్టి దాన్ని చదివిన తరవాత మీకు బహిరంగ లేఖ రాస్తున్నా. ఇందులో కొన్ని ప్రశ్నలను అడుతున్నా.

లేఖలో మొదటి వాక్యమే మీరు జైలులో లేనని రాశారు. కాబట్టి దయచేసి మీ న్యాయ పోరాటం మొత్తాన్ని ఆపేయండి. క్వాష్‌ పిటిషన్లు, బెయిల్‌ పిటిషన్లను  ఉపసంహరించుకోండి. 

♦  మీ రాజకీయ జీవితం అంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం సాగిందన్నారు. తెలుగు ప్రజలు అంటే మీ ఉద్దేశంలో ఎవరు? హైదరాబాద్‌ మెట్రోలో నల్ల చొక్కాలు వేసుకున్న ఆ నలుగురా? అమెరికా, బ్రిటన్‌లో మీ దోపిడీ సొమ్ములతో స్థిరపడిన మీ బంధుగణాలా? ఎన్టీఆర్‌కు మీరు వెన్నుపోటు పొడవటంలో సహకరించిన మీ మీడియా మిత్రులా? బీజేపీలో ఉన్న మీ బంధువులా? కాంగ్రెస్‌లోకి పంపించిన మీ మనుషులా? కొద్దిమంది వామపక్షాల నాయకుల్లో ప్రవహిస్తున్న మీ పసుపు రక్తమా? తెలుగు ప్రజలంటే ఎవరు అన్నది దయచేసి తెలియజేయండి.

ఓటమి భయంతో మిమ్మల్ని జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేయాలని ఎవరో అనుకుంటున్నారని లేఖలో ఆరోపణలు చేశారు. ఒక అవినీతిపరుడిని కేంద్ర ఐటీ శాఖ పట్టుకుని షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. అది మీరే. స్కిల్‌ స్కామ్‌లో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. దానికి కర్త, కర్మ, క్రియ మీరే. స్కిల్‌ స్కామ్‌లో కోర్టు మీకు రిమాండ్‌ విధించింది. దాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించాయి. మరి ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరో దూరం చేయటం ఏమిటి? 45 ఏళ్లు దొరక్కుండా తప్పించుకున్నాననే మీ ఆత్మవిశ్వాసం, వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ ఈసారి మీకు సాధ్యం కాలేదు. కాబట్టి దొరికిపోయిన దొంగ దేశభక్తుడ్ని అని, ప్రజాసేవకుడ్ని అని భారీ డైలాగులు చెప్పటం బాగోదు. 

♦   స్కిల్‌ స్కామ్‌లో సీబీఐ విచారణ జరగాలని ఎవరో పిటిషన్‌ వేస్తే మీ ప్యాంట్లు ఎందుకు తడు­స్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వ విచారణ కక్ష సాధింపు అని మీరు అంటున్నారు. అదే నిజ­మైతే.. కేంద్ర ప్రభుత్వ సీబీఐ విచారణకు మీరు ఆహ్వానించాలి కదా? మరి, రెండింటికీ గుడ్డలు తడుస్తున్నాయంటే మీరు లేఖలో రాసిన డైలా­గులన్నీ ఆత్మవంచనతో కూడిన అబద్ధాలే కదా?

♦  ఈ రాష్ట్రంలో ఉండని మీరు, మీ పుత్రుడు, మీ దత్తపుత్రుడు కేవలం గెస్ట్‌లు మాత్రమే కదా? ఇది మీకు వీకెండ్‌ రిసార్ట్‌ మాత్రమే కదా?

♦   నా బలం జనమే అని చెబుతున్న మీరు ఈ మధ్య జగన్‌ గారి స్పీచ్‌లు బాగా చూస్తున్నారని అర్థమైంది. సీఎం జగన్‌ పొత్తులను నమ్ముకోవట్లేదు. ఇంటింటికీ తాను చేసిన అభివృద్ధిని, రూ.2.38 లక్షల కోట్ల డీబీటీని, ఇచ్చిన 31 లక్షల ఇళ్ల పట్టాలను, కడుతున్న 22 లక్షల ఇళ్లను, గ్రామ గ్రామంలో తెచ్చిన మార్పులను చూపించి మీరే నా బలం అని ప్రజలకు చెబుతున్నారు. 

♦  చెడు గెలిచినా నిలవదని, మంచి తాత్కాలికంగా ఓడినా కాల పరీక్షలో గెలుస్తుందని మీరు అంటున్నారు. సీఎం జగన్‌ విషయంలో జరిగింది అదే కదా! ఆ చెడు చేసింది మీరే కదా? 

♦  దసరాకి పూర్తి మేనిఫెస్టో విడుదల చేయలేక­పోయానంటూ మరో భారీ డైలాగు వదిలారు. 2014 మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 650 వాగ్దానా­లకు, అధికారంలోకి వచ్చాక మీరు చేసిన మొద­టి సంతకాలకు ఏనాడూ దిక్కూమొక్కూ లేదు. కాబట్టే ప్రజలు మీరు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే­ల సంఖ్యకు తగినట్లే మీ పార్టీని పరిమితం చేశారు. ఇప్పుడు మీరు మరో మేనిఫెస్టో విడుదల చేస్తే ఎంత? చేయకపోతే ఎంత?

♦  సంకెళ్లు మీ సంకల్పాన్ని బంధించలేవని,  జైలు గోడలు మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయలేవని అంటున్నారు. మీమీద మీకు అంత నమ్మకం, ధైర్యం ఉంటే మీ ఆదాయం ఎంత? మీ ఆస్తులు ఎంత? అనే అంశంపై నేను పిటిషన్‌ వేస్తా. కోర్టుల్లో స్టే కోసం వెళ్లకుండా సీబీఐ విచారణకు సిద్ధపడతారా? 

♦  ఎప్పుడూ బయటకు రాని మీ భార్యను ప్రజల్లోకి పంపటం ఎందుకు? వెన్నుపోటు పొడిచినప్పుడే కన్నతండ్రి పక్షాన కాకుండా మీవైపు నిలిచిన ఆమె ఎన్టీఆర్‌ వారసురాలు ఎలా అవుతుంది? ఎన్టీఆర్‌ను మొదట మీరే పొడిచారన్న నిజం చెప్పి ఆ తర్వాత ఆవిడ నిజం గెలవాలి అంటూ నినాదం చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement