
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఆదిలాబాద్ రాను న్నారు. జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. జనగర్జనగా దీనికి నామకరణం చేశారు. ఇటీవలే అమిత్ షా ఆదిలాబాద్ పర్యటన ఖరారవగా ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ఈ సభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పరిధిలోకి వెళ్లనుంది. బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సభ ఖర్చు పార్టీ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ టూర్ నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆదిలాబాద్ పట్టణాన్ని కాషాయ జెండాలతో నింపేసింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర రాష్ట్ర నేతల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ నిర్వహించనున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.